అధ్యాయము యొక్క సారాంశము
మానవులు పాపములో పడిపోయి దేవుని సన్నిధికి దూరమగుట ఈ అధ్యాయములోని ప్రధానమైన అంశము. సాతాను సర్పము ద్వారా స్త్రీని మోసపరచి ఇద్దరు దేవుని నిబంధన మీరునట్లుగా చేసినది. నిషిద్దమైన ఫలము తినుటద్వారా వారు దేవుని నిబంధన మీరి తాము దిగంబరులమని తెలుసుకొని వారి కొరకు ఆకులతో కచ్చడములు చేసుకొనిరి. దేవుడు వారితో సహావాసమునకు వచ్చినపుడు దేవునికి ఎదురుపడే ధైర్యములేక వారు తోటలోని చెట్లమద్య దాగుకొనిరి. దేవుడు వారు దాగుకొనిన విషయము విచారణ చేసినపుడు, దేవుడు వారికి ఇచ్చిన అవకాశము స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉపయోగించుకొనక పోవుటవలన వారు శిక్షకు గురికావలసి వచ్చినది. వారు తాము చేసిన తప్పు ఒప్పుకొనక ఒకరిమీద ఒకరు నేరము మోపుకొనిరి. ఆదాము ఒక అడుగు ముందుకు వేసి దేవుడు తనకు స్త్రీని ఇవ్వటము వలననే ఈ పాపము జరిగినట్లుగా సాహసించి మాట్లాడాడు. దేవుడు సర్పమును శపించి, సాతాను యొక్క అధికారమును తొలగించుటకు రక్షకుని గురించిన వాగ్ధానము చేసినారు. దేవుడే స్త్రీ, పురుషుల తరుపున పాపపరిహారార్ధ బలి అర్పించి వారికి చెర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించారు. దీనిని బట్టి ఆయన మనలను అసహ్యించుకుని త్రోసివేసే దేవుడు కాదని అర్ధము అవుతుంది. వారు పాపములోనే ఎల్లకాలము జీవించి ఉండకుండా మరలా వారిని తనతో అనుసంధానము చేసుకోవటానికి జీవవృక్ష ఫలము తినకుండా వారిని ఏదేను తోటనుండి పంపివేయటము జరిగినది. ఎవరూ జీవవృక్షము సమీపించకుండా ఏదేనుకు తూర్పున కెరూబులను, వృక్షమునకు చుట్టూ అటు ఇటు తిరుగు ఖడ్గజ్వాలను కావలి ఉంచటము జరిగినది.