అధ్యాయము యొక్క సారాంశము
పాపము యొక్క పర్యవసానములు ఎలా ఉంటాయి, అవి మానవ జీవితమును ఎలా చిన్నాభిన్నము చేస్తాయి అనేదానికి ఈ అధ్యాయము ఒక గొప్ప ఉదాహరణ. ఆదామునకు ఇద్దరు సంతానము(కయీను, హేబెలు) కలిగిరి. వారు ఇద్దరు పెరిగి పెద్దవారు అయినపుడు దేవునికి అర్పణ తీసుకువచ్చిరి. దేవుడు చిన్నవాని అర్పణ అంగీకరించి, పెద్దవాని అర్పణ తృణీకరించటముతో కోపముతో పెద్దవాడు చిన్నవానిని సంహరించటము జరిగినది. తన తప్పిదము సరిచేసుకోమని దేవుడు మందలించినా కూడా వినకుండా కయీను పెడచెవిన పెట్టాడు. దాని నిమిత్తము పెద్దవాడు దేవుని చేత శాపమునకు గురి అయి దేవుని సన్నిధి నుంచి వెలివేయబడినాడు. తరువాత అతనికి కలిగిన సంతతి వివరములు ఇవ్వబడినాయి. కానీ మరలా 5వ తరములో తమ పితరుడు అయిన కయీను చేసిన తప్పిదమునే లెమెకు చేసినాడు. అతను ఒక యవస్తుని సంహరించాడు. బహుభార్యాత్వము అనేది లెమెకు ద్వారా లోకమునకు పరిచయము చేయబడినది. తరువాత దేవుడు ఆదామునకు మరలా సంతానము కలుగజేయటము, ప్రజలు దేవునికి ప్రార్ధన చేయటము ఆరంభించటముతో ఈ అధ్యాయము ముగుస్తుంది.