ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (1:1).
సృష్టికర్త ఉన్నాడు
మానవుడు దేవుడు ఉన్నాడు అని విశ్వసించడానికి అంగీకరించడానికి ఇష్టము లేక తన పరిజ్ఞానంతో ఈ సర్వ సృష్టి ఎలా ఉనికిలోనికి వచ్చినది వివరించడానికి అనేకరకాల సిద్ధాంతాలను ప్రాచుర్యములోనికి తీసుకురావడం జరిగినది. ఈ ప్రయత్నములలో మనిషి తెలుసుకున్న దానికన్నా ప్రశ్నలు ఎక్కువ మిగిలిపోయాయి. సృష్టి మొత్తం ఎలా పనిచేస్తుంది అనేది సంపూర్ణముగా వివరించుటలో మానవులు విఫలం చెందారు. అనేక రకాల సందేహాలతో కొట్టుమిట్టాడుతున్న మానవజాతికి దేవుడు ఈ ఒక్క వచనముతో సమాధానము చెప్పటం జరిగినది. ఏదీకూడా దానంతట అదే ఉనికిలోనికి రాలేదు. దీని అంతటి వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అని, ఆయన పేరు దేవుడు అని ఈ వాక్యం తెలియజేస్తుంది. దేవుడు సత్యమును సూటిగా సింపుల్ గా మాట్లాడడము ఇక్కడ మనము గమనించగలము. ఎటువంటి వాదములు చేయలేదు. ఇంత అందముగా, ఎక్కడా లోపము లేకుండా సంక్లిష్టతతో కూడిన విశ్వము భారీ పరిణామములో ఉన్న వస్తువులు శూన్యములో వ్రేలాడటము అనేది దానంతట అదే జరగటానికి అవకాశం 0% అని చదువురాని వారు సహితము చెప్పగలరు. మన అహంకారము విడిచి పెడదాము. సృష్టికర్తఉన్నాడు అని విశ్వసిద్దాము.
సృష్టిలో ప్రభువైన యేసుక్రీస్తువారి పాత్ర అమూల్యమైనది
యోహాను సువార్త 1వ అధ్యాయము ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తువారి మూలముగా సమస్తము కలిగినవి. ఆయన ఆదినుంచి ఉన్నవాడు. ఈ సమస్త సృష్టిని ఇంత అందముగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఎలోహిమ్ అని ఉపయోగించబడిన ఆయన నామములో ప్రభువైన యేసుక్రీస్తువారు పరిశుద్ధాత్మ దేవుడు ఇమిడి ఉన్నారు. ఆయన తన స్వహస్తములతో చేయబట్టే సృష్టిమీద ముఖ్యముగా మానవులమీద ఆయనకు అంత ప్రేమ ఉండటము మనము గమనించగలము. అందుకే ఈ ప్రకృతిని మానవులను విడుదల కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాయశ్చిత్తము చేశారు. ఈ ప్రకృతి కూడా ఆయన మాటకు లోబడుట అనేది మనము పరిశుద్ధ లేఖనములలో చూడగలము. ఈ సృష్టి మొత్తమునకు ఆయన అధిపతియై ఉన్నారు. ఆయన తీర్చిదిద్దిన ప్రకృతి మనకు దయచేసిన వనరులను, వసతులను చూచినప్పుడు అవి ఆయనకు మనమీద ఉన్న ప్రేమకు అద్దంపడుతున్నాయి. ఒక తార్కాణముగా నిలుస్తున్నాయి. ఇంత సృష్టిచేసిన ఆయన తన చేతులద్వారా చేయబడిన అంతటి దానిమీద భూమిమీద మనకు అధికారము ఇచ్చినారు. ఆయన మనయెడల కలిగి ఉన్న తలంపులు ఎలాంటివి అనేది ఆయన కార్యములు మనకు వివరిస్తున్నాయి. ఈ భూమిని మించిన ఎన్నో గొప్ప గ్రహములు ఈ విశ్వంలో ఉన్నాకూడా ఈ వాక్యములో భూమి గురించి ఆయన ప్రత్యేకముగా ప్రస్తావించడము, ఆయన భూమి గురించి తీసుకున్న శ్రద్ధ, మిగతా గ్రహములు ఇలా తీర్చిదిద్దిబడకపోవుట చూడగా అది మన హృదయములకు అనేక విషయాలు బోధిస్తుంది
ఆయన జ్ఞానము అనంతమైనది శోధింప శక్యము కానిది
ఈ విశ్వము యొక్క సృష్టిని దేవుడు చేసిన రకరకముల జాతులను వాటిలోని వైవిద్యమును, అందమును, గౌరవమును మనము గమనించినప్పుడు అవి దేవుని యొక్క జ్ఞానమునకు, నైపుణ్యతకు, సమర్థతకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తాయి. మానవులు ఇంతవరకు ఈ వచనములో దేవుడు చేసిన సృష్టిని అర్థంచేసుకోవడంలో విజయము అనేది సాధించలేకపోయారు. దీనికి గల ప్రాముఖ్యమైన కారణము మనకు ఉన్న పరిమితి కలిగిన తెలివి, జ్ఞానముతో అనంతమైన దేవుని జ్ఞానమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయటమే. ఈ లోకములో మనకు తెలియని విషయములను జ్ఞానము కలిగినవారి యొద్దకు వెళ్లి ఎలా తెలుసుకుంటామో అలానే దేవుని దగ్గర మనకు తెలియని విషయములు నేర్చుకోవాలి. తయారుచేసిన వ్యక్తికన్నా కూడా మిగిలిన ఎవరికికూడా చేయబడిన వస్తువును గురించిన జ్ఞానము, అవగాహన ఉండవు గదా. అలానే సమస్తమును చేసిన దేవునికి ఈ సృష్టి మొత్తమును గురించిన పరిపూర్ణ అవగాహన ఉంటుంది. గురువు కన్నా శిష్యుడు గొప్పవాడు కాదు అని లేఖనము సెలవిస్తుంది. ఆయన ద్వారా కాకుండా స్వంతముగా ఇన్ని ఆవిష్కరణలు, గొప్ప సంగతులు కనిపెట్టిన మానవజాతి ఆయన దగ్గర నేర్చుకుని ఉంటే ఎంతో తక్కువ సమయంలో ఇంకా ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకుని ఉండేవారము. ఎంతో సమయము, ధనము ఆదా అయి ఉండేది, మన జీవన ప్రమాణములు కూడా ఎంతో మెరుగుగా ఉండేవి.