ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (1:1).
దేవుడు త్రిత్వమై ఉన్నాడు
దేవుని యొక్క నామములలో ఒకటయినటువంటి ఎలోహిమ్ అనే పదము ఇక్కడ ఉపయోగించబడినది. దేవుని యొక్క గుణగణములను/ లక్షణములను మనము ఆయన నామముల ద్వారా తెలుసుకోగలము. పరిశుద్ధ గ్రంథము యొక్క మొదటి వచనములోనే ఆయన ఏమై ఉన్నాడు అని మనకు తెలియజేయటము జరిగినది. ఎలోహిమ్ అనే మాటకు దేవుళ్ళు అని అర్థం వస్తుంది. పరిశుద్ధ లేఖనములను మనము గమనించినప్పుడు ఆయన తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్ముడుగాను మనకు బయలుపరుచుకొన్నారు. ఈ త్రిత్వము యొక్క లక్షణము మొదటిగానే ఈ నామము ద్వారా ఆయన బయలుపరచడం జరిగినది. ఇక్కడ ముగ్గురు సమానమే. సృష్టి అంతటిలోను ముగ్గురి భాగస్వామ్యము ఉన్నది. మనము ఒకరినే తీసుకొని మిగతావారిని విడిచిపెడితే వారి స్వరూపము కొంత మనలో లోపించే అవకాశము ఉన్నది. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆరాధిస్తేనే మనము ఆయన సంపూర్ణతలోనికి మారగలము. గొప్ప వ్యక్తులు ఎవరూకూడా తమ గురించి ఇతరులకు సులభముగా తెలియనివ్వరు. కానీ మన దేవుడు తన గురించిన సమస్తము సులభముగా అర్థం చేసుకునేలా మనకు తెలియజేయడం జరిగినది. ఆయన ఔన్యత్వము, తగ్గింపు చాలా గొప్పవి, ఆచరణీయమైనవి.
దేవునికి వ్యతిరేకముగా మనము నిలబడలేము
దేవుని యొక్క సృష్టిలోని నీరు, గాలి, నిప్పు అనేవి ఆయన అభీష్టము అనుసరించి మన అవసరతలు తీరుస్తున్నాయి. మనము అవిధేయత చూపించినప్పుడు దేవుడు వాటిని ఆయుధములుగా వాడి మనకు తీర్పుతీర్చటము కూడా గమనించగలము. మనము విధేయత కలిగినంత కాలము అవి మనకు ఏ విధమైన హాని కలగజేయకుండా దేవుడు వాటిని నియంత్రిస్తున్నారు. వాటిని ఎదుర్కోవడానికి సరి అయిన ఆయుధము గాని, వ్యూహము గాని మానవుల యెద్ద లేదు. ఆయన ప్రేమ, కరుణ ఎంత ఆహ్లాదముగా, అందముగా ఉంటాయో, ఆయన కోపము, తీర్పు అంతే భయంకరముగా ఉంటాయి. సృష్టికర్తగా ఆయనకు సమస్తముమీద సర్వహక్కులు ఉన్నాకూడా ఆయన ఎప్పుడు మనలను బానిసలుగా చూడలేదు. ఆయన స్నేహితులుగా, కుమారులుగా చూచిన ప్రేమ ఆయనది. తన స్వంత రూపము, పోలిక ఇచ్చిన కృప ఆయనది. ఆయనమీద తిరుగుబాటుచేసి, వెళ్లి నివసించడానికి మనకు విశ్వంలో ఎక్కడ స్థానము లేదు. అలాంటి ప్రేమ లేకుండా మన మనుగడ కూడా సాధ్యంకాదు. అది గుర్తించి ఆయన ప్రేమకు లోబడి ఉందాము. ఆయనకు కోపము రేపకుండా మన ప్రవర్తన సరిదిద్దుకుందాము. దేవుని తిరస్కరించినవారు నిత్యనాశనము పొందుతారు అని లేఖనము సెలవిస్తుంది.
ఆయన ద్వారా ఆకాశమహాకాశములు చేయబడ్డాయి
ఈ వచనము గమనించినట్లయితే భూమి, ఆకాశములు అని భూమికి ఏకవచనము ఆకాశమునకు బహువచనము ఉపయోగించటము జరిగినది. పరిశుద్ధ గ్రంథము ప్రకారము 3 ఆకాశములు కలవు. మొదటిది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మేఘములు కలిగి మన కంటితో చూచుచున్న ఆకాశము. రెండవది మధ్య ఆకాశము. ఇక్కడ దురాత్మ, అంధకార శక్తులు ఉంటాయి అని బైబిల్ సెలవిస్తుంది. మూడవ ఆకాశము దేవుని నివాసస్థలమైన పరలోకము. భూమి అని ఏకవచనము ఉపయోగించడం ద్వారా ఆయన అలాంటిదే మరొకటి లేదు అని తెలియజేస్తున్నారు. భూమిమీద తప్ప మిగతా గ్రహములలో ఎక్కడా సృష్టి చేసినట్లు మనకు లేఖనములలో ఆధారము లేదు. అందుకే ఇంతవరకు ఎక్కడా జీవము కనిపెట్టబడలేదు. మానవుడు నివసించడానికి భూమి తప్ప అనువైన ప్రదేశము మరొకటి లేదు. ఆయన సహకారము, కృప లేనిదే మన మనుగడ అసాధ్యము. ఆయన లేకుండా మనకు ఉనికి అనేది లేదు అనే విషయం గుర్తించాలి. మనకున్న మిడిమిడి జ్ఞానముతో దేవుని మీద తిరుగుబాటు చేయకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి. జీవితము యొక్క విలువ గుర్తించాలి. ఆయన జాలి, కృప ద్వారానే మనము ఇంకా బ్రతికి ఉన్నాము అని గ్రహించాలి.