దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను (1:14-19).

ఇన్ని విధములుగా దేవుడు మాట్లాడుతూ, సంఘము ద్వారా, విశ్వాసుల ద్వారా అనేక అవకాశములు మనకు ఇచ్చినప్పుడు చెవియెగ్గకుండా దేవుని మీద తిరుగుబాటు చేసినట్లయితే ఉదయకాలమున దేవుడు దేశములో ఉన్న దుర్మార్గులను సంహరించెను అన్న లేఖనము మన జీవితములో నెరవేరును. ఎన్నిసార్లు గద్దించినా విననివాని మీదకి నాశనము అకస్మాత్తుగా వచ్చి పడుతుంది అని పరిశుద్ధ గ్రంథములో సెలవిచ్చినట్లు మన మరణదినము ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి నేడు అనే దినము, అవకాశము దేవుడు మనకు అనుగ్రహించినపుడే మనము ఆయన కృపకు స్పందించాలి. అవకాశము అయిపోయిన తరువాత ఎంత విచారించినా ఉపయోగము లేదు. ఈ వచనములలో దినములు, సంవత్సరములు తప్ప మాసములు లేవు. ఈ ప్రక్రియ అనుదినము జరిగించుట ద్వారా వెలుగు, చీకటి ద్వారా దేవుడు మనకు ఇస్తున్న హెచ్చరికలు దినముల వారీగానే లెక్కించబడతాయి. ప్రతిదినము మనకు ఒక అవకాశమే. ఈ యొక్క ఉగ్రత రాకుండా చంద్రుని వెలుగు భూమి వేడి తగ్గించి చల్లపరిచిన రీతిగా, సంఘము దేవుని ఉగ్రత తప్పించబడునట్లు ప్రజలకొరకు బండసందులలో నిలబడి విజ్ఞాపన చేయాలి. దేవుడు ఇన్ని దినములు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే విషయము మనము అర్థము చేసుకోవాలి. దేవుని ఉగ్రత మనమీదకు రాకముందే స్పందిద్దాము. మన తోటి సహోదరుల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాము. లోకము యొక్క సంరక్షణ సంఘము చేతిలోనే ఉన్నది.

స్తుతి

  1. మనము ఎప్పుడూ సంపూర్ణమైన అంధకారములో నివసించకుండా మన కొరకు జ్యోతులను నిర్మించినందుకు
  2. ఆయన వెలుగులో మనము నడుచుట ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నందుకు
  3. ఆయన భక్తుల జీవితమును మనకు మార్గదర్శకముగా ఉంచి మనలను ప్రోత్సహిస్తున్నందుకు
  4. చీకటిలో నివసిస్తున్న వారిని రక్షించుటకు ఏర్పరచిన ఆయన సంఘము కొరకు
  5. అనుదినము ఆయన కృపను దూరము చేయకుండా ఉన్నందుకు.

ఆరాధన

  1. మన జీవితములో అనుదినము ఆయన వెలుగులో నడుస్తూ నీతిక్రియలు చేయుట ద్వారా ఆయనను ఆరాధించాలి
  2. సంఘము యొక్క పరిచర్యలో మనవంతు సహకారము, పాత్ర పోషించి ఆయనను ఆరాధించాలి

హెచ్చరిక

  1. మనము ఆయన వెలుగులోనికి నడవకపోతే అంధకారములోనే ఉండిపోవలసి వస్తుంది

సత్యము

  1. దేవుడు మనము ఆయన కుమారుని సంపూర్ణత లోనికి నడవాలి అని ఆశిస్తున్నారు
  2. సంఘము ఎప్పుడు దేవునికి విశ్వాసులకు మధ్యలో అడ్డుగా రాకూడదు