దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను (1:3).
సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయన యొక్క కార్యక్రమములను, శక్తిని, నైపుణ్యతను, మహత్యమును, సమర్థతను, మనము చూడగలిగేలాగున ఆయన వెలుగు సృజించటము జరిగినది. ఆ వెలుగు ఏమి తనలో ఇముడ్చుకుని ఉంది అనేటటువంటి సాంకేతిక వివరములు మనకు ఇవ్వబడలేదు. సాంకేతికపరమైన research కోసము కాకుండా ఏది మనకు జీవితములో ప్రాముఖ్యమైనది, దేనికి సంబంధించిన వివరములను మనము తెలుసుకోవాలి అనే దృక్పదముతోనే పరిశుద్ధ గ్రంథమును దేవుడు వ్రాయించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ వెలుగు అనేది ఆయన పనిచేయడము కొరకు అవసరము లేదు. ఆయనకు వెలుగు, చీకటి ఒకేలా ఉన్నాయి అని వాక్యము మనకు తెలియజేస్తుంది. అయితే వెలుతురు లేకుండా ఏమీ చూడలేని కన్నులు మనము కలిగి ఉన్నాము కాబట్టి ఆయన చేతి పనులను మనము చూసి ఆయన గురించి గ్రహించేలాగున ఈ వెలుగు అనేది చేయబడినది
ఆయన కేవలం తన నోటి మాటద్వారా ఈ కార్యము జరిగించినట్లు లేఖనము మనకు తెలియజేస్తుంది. ఆయన పలికిన వెంటనే అది ఉనికిలోనికి రావడము మనము గమనించినపుడు, ఆయన వాక్యమునకు గల శక్తిని మనము అర్థం చేసికొనవచ్చు. అందుకే బైబిల్ నందు ఆయన నోటినుంచి బయలువెళ్లిన మాట నిరర్థకముగా వెనుకకు తిరిగిరాదు అని మనకు వ్రాయబడి ఉన్నది. అందువలననే లేఖనముల ద్వారా అనేకమంది జీవితములు కట్టబడటమనేది మనము చూడగలము. అవి అన్నియు ఆయన నోటినుంచి వచ్చిన శక్తి కలిగిన మాటలు. ఆయన వాక్కునకు ఉన్న విలువను, అధికారమును మనము గుర్తించాలి. దేవుని వాక్యము పట్ల అపరిమితమైన గౌరవమును ఏర్పరచుకోవాలి. మన నోటి మాటలవలన ఏ విధమైన అద్భుతములు జరుగవు గాని ఆయన మాటలను మన నోటి ద్వారా పలికినప్పుడు అద్భుతములు జరుగుతాయి. వాక్యము ద్వారా ఎంతోమంది హృదయములు కదిలించబడటము అనేది మనము ప్రతిరోజూ చూస్తున్నాము.
వెలుగునకు ఉన్న లక్షణములను మనము గమనించినప్పుడు అవి దాని సృష్టికర్త యొక్క లక్షణములను, ఆలోచనను, ఆయన స్వభావము మనకు బయలుపరుస్తుంది. వెలుగు అందరికీ ఇష్టమైనది. తను ఉన్నచోట ప్రాణమునకు ఆనందం కలిగిస్తుంది. ఎదుటివారు పనులను చేసుకోవడానికి గొప్ప సాధనముగా ఉపయోగపడుతుంది. స్వచ్ఛమైనది, మచ్చలేనిది, సమస్తరంగులను తనలో ఇముడ్చుకుని ఒకే రంగుగా ఉంటుంది. విశ్వములో అన్నిటికన్నా వేగవంతమైనది. ఎంతదూరము అయినా ప్రయాణము చేయగలిగినది. సృష్టించబడిన వస్తువునకే ఇన్నిమంచి గుణాలు, లక్షణములు ఉంటే దానిని చేసిన/ సృష్టించిన సృష్టికర్తకు ఇంక ఎంత మంచి గుణాలు, లక్షణములు ఉంటాయి అనేది మనము ఆలోచించాలి
చీకటి అనేది ప్రాణమునకు ఇష్టము ఉండదు. దేవునిచేత చేయబడిన ప్రతి ప్రాణికూడా వెలుగును ప్రేమిస్తుంది. చీకటిలోనుంచి బయటికి వచ్చి వెలుగును చూసినప్పుడు ఆనందిస్తుంది. అలానే అంధకారములో కొట్టుమిట్టాడుతున్న మనకు దేవుడు వెలుగును అనుగ్రహిస్తారు. ఆయన కేవలము మాటలతో మాత్రమే ఆదరించే దేవుడు కాదుగాని క్రియలద్వారా ఆదరణ కలిగించేవాడు. ప్రాణమును తెప్పరిల్లజేసే దేవుడు. నాకు భయం కలిగినప్పుడు, ఇరుకులోను, బంధకములలోను మొరపెట్టినప్పుడు దేవుడు నన్ను విడిపించాడు అని కీర్తనల గ్రంథంలో దావీదు కూడా దృఢముగా సాక్ష్యము ఇస్తున్నాడు. వెలుగు ద్వారా ఆయన మన ప్రాణములకు ఊరట ఇచ్చి చీకటి వలన కలుగు ప్రతి వేదననుంచి భయమునుంచి విడుదల ఇస్తారు. మనకు అవసరమైన ఆ మనోధైర్యము ఇవ్వడానికి కూడా వెలుగు అనేది సృష్టించబడినది. పని అంతాకూడా పూర్తిచేసి దేవుడు వెలుగు ద్వారా మనకు చూపించి ఆనందింపజేసేకన్నా ముందుగా వెలుగు ఇచ్చి ఆ చిన్న ఆనందము మెల్లమెల్లగా పరిపూర్ణ సంతోషముగా మారి హృదయము ఉప్పొంగులాగున సృష్టి అందముగా చేయబడినది. దీనిని బట్టి మనము వేదన పడటము చీకటిలో ఉండటము అనేది కొద్దిసేపు సహితము, ఆయనకు ఇష్టం ఉండదు అని మనకు అర్థం అవుతుంది. మన కన్నులలో ఎల్లప్పుడు సంతోషము మాత్రమే చూడాలి అనుకునే ఆ తండ్రిని కలిగిన మనము ఎంతైనా ధన్యులము. ఇంతకు మించిన ఆశీర్వాదము మనకు అవసరము లేదు/ఉండదు కూడా