వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను (1:4).
దేవుడే స్వయముగా వెలుగును చీకటిని వేరుచేయటము జరిగినది. ఇక్కడ వెలుగు అనేది దేవుని సంబంధ క్రియలకు సాదృశ్యంగా ఉంటే చీకటి అనేది సాతాను లేదా పాప సంబంధమైన క్రియలకు సాదృశ్యముగా ఉన్నది. ఈ రెండు కలిసి ఉండటము జరుగని పని అని దేవుడు ఈ కార్యము ద్వారా స్పష్టంగా తెలియజేశారు. మనము అలా నులివెచ్చని స్థితిలో ఉండటము ఆయన చిత్తము కాదు, దేవుడు అంగీకరించడు అని ప్రభువైన యేసుక్రీస్తువారు స్పష్టముగా ప్రకటన గ్రంథములో తెలియజేయటము జరిగినది. మనము వెలుగును వెంబడించాలా చీకటిని వెంబడించాలా అనే నిర్ణయము యొక్క స్వేచ్ఛ ఆయన మనకే ఇచ్చారు. ఆ నిర్ణయమును బట్టి మన జీవిత గమ్యము ఆధారపడి ఉంటుంది. వెలుగును, చీకటిని వెంబడించటము సాధ్యము కాదు. ఎవరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు అని ప్రభువే స్పష్టముగా సెలవిచ్చారు. ఆయనను మించిన జ్ఞానము మనకు ఎప్పుడూకూడా లేదు. ఆయన వెలుగును మాత్రమే certify చేశారు కాబట్టి ఆయనకు వారసులుగా మనముకూడా వెలుగును మాత్రమే వెంబడించాలి. వాటిని వేరుచేసినట్లు మనముకూడా చీకటి సంబంధమైన క్రియలకు వేరై బ్రతకాలి. అందుకే ఎక్కడాకూడా చెడును గురించిన జ్ఞానము మనిషి పొందుకోవాలి అని దేవుడు ఆశించలేదు. మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము తినవద్దు అని తెలియజేయడానికి/ ఆజ్ఞాపించటానికి గల బలమైన కారణము ఇదే. మనము కొంచెమైనా కలుషితము అగుట అయనకు ఇష్టము ఉండదు
వెలుగును, చీకటిని వేరుచేసిన దేవుడు చీకటిని శాశ్వతముగా దూరం చేయలేదు. దానికి దీనికి మధ్య కొంత యెడము మాత్రమే కలుగజేశారు. మన శరీరము నిర్మించబడినప్పుడు దానికి విశ్రాంతి అనేది అవసరము కాబట్టి ఆ సమయమునకు తగినట్లుగా వాటి నిడివిని చూపించటము జరిగినది. ఆ విశ్రాంతి సమయములో కూడా సంపూర్ణమైన చీకటి కలుగకుండా తక్కువ వెలుగు కలిగిన వాటిని మన కోసము చేశారు. కేవలము నశించిన, తీర్పు విధించబడిన ఆత్మలు మాత్రమే కటిక చీకటిలో నివాసము చేస్తాయి. దేవునికి దూరముగా జరిగిన మరుక్షణము, ఆయన వెలుగు లేకపోతే మన జీవితములు ఎలా మారిపోతాయి అని గురుతు, హెచ్చరిక మనకు ఎల్లవేళలా కలిగి ఉండేలా చీకటి, వెలుగు చివర ఉంచబడినది. వెలుగు దాటి వెళ్లినవారి యొక్క చివరిగతి అదే అని మనకు ప్రత్యక్షముగా తెలియజేస్తుంది. మనము పరిధులు దాటకుండా ఉండడానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రము కలిగిన ఆత్మగా మనలను రూపించాలి అనుకున్న దేవుడు ఇలాంటి హెచ్చరికలు మన కన్నులముందు ఉంచటము జరిగినది. మనము వేయబోయే అడుగుల యొక్క పర్యవసానము తెలుసుకోవటానికి, జాగ్రత్తతో కూడిన బాధ్యతాయుతమైన నిర్ణయములు తీసుకోవటానికి ఆ రెండూకూడా మన కన్నుల ఎదుట ఉంచబడ్డాయి. రాత్రిపూట మనము కలిగి ఉండే నిద్రావస్థ కూడా మన శరీరము చీకటి క్రియలకు మృతమైనదిగా ఉండాలి అనే పాటము మనకు నేర్పిస్తుంది.
వెలుగును చీకటిని వేరుపరచిన విధము చూడగా మనము వెలుగులో నడిచినంతకాలము చీకటి మనమీద అధికారము చలాయించకుండా దేవుడు చేసియున్నారు. వెలుగు చీకటిని పారద్రోలుతుంది కానీ చీకటి వెలుగును పారద్రోలలేదు. మన అంతట మనము స్వచిత్తముతో చీకటిలోనికి అడుగులు వేస్తే తప్ప చీకటి మనలను తనలోనికి లాగుకొనలేదు. అందుకే వెలుగును విడిచివెళ్లకుండా మనము జాగ్రత్తపడాలి.
వెలుగుయొక్క పరిధికి చివర వున్న వ్యక్తికి చీకటి సమీపమున ఉంటుంది. మధ్యలో ఉన్న వ్యక్తికి చాలా దూరముగా ఉంటుంది. అందుకే దేవుడు వెలుగునకు రమ్మని పిలవటము జరుగుతుంది. పరిధికి చివర ఉండే వ్యక్తిని శోధించటము చీకటికి తేలిక కానీ మధ్యలో ఉన్న వ్యక్తిని ఆకర్షించటము కష్టము. మనము వాక్యములోనికి ఎంత లోతుగా ఉంటే అంత బలముగా ఉంటాము. నామకార్థముగా వాక్యమును ఆశ్రయిస్తే ఎప్పుడు తొట్రిల్లే అవకాశము ఉంటుంది.
ఇవి ఒకదాని తరువాత ఒకటి పెట్టటములో నిరీక్షణ, హెచ్చరిక ఉన్నాయి. వెలుగులో రక్షణ పొందిన వ్యక్తి చీకటిలోనికి వెళ్లకుండా తన రక్షణ కాపాడుకోవాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా తీర్పుదినమున వెలుగు/ కృప లోకమునుండి వేరుచేయబడిన దినమున చీకటిలోనికి వెళ్లిపోయే ప్రమాదము ఉంది. అందుకే పౌలు వణుకుతోను భయముతోను రక్షణ కాపాడుకోవాలి అని వ్రాసాడు. చీకటిలో ఉన్న వ్యక్తికి వెలుగులోనికి వెళ్లవచ్చు అనే నిరీక్షణ కలిగిస్తుంది. చీకటిలోనే జీవితము ముగించవలసిన అవసరం లేదు.