దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను; అవి మీకాహారమగును. భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. (1:29-30)
ఇప్పటివరకు జీవము దయచేసి సృష్టించిన జీవరాసులకు వాటి అనుదిన పోషణకు అవసరమైన ఆహారమును దేవుడు ఈ వచనములలో అందజేయటము జరిగినది. ఇక్కడ జీవరాసులు మొర్రపెట్టక ముందే దేవుడు దానిని దయచేయటము మనము గమనించాలి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అని ప్రభువు చేసిన పార్ధన కూడా దీనికి సరిగానే ఉన్నది. మనము ఆహారము పుచ్చుకొనుట అనేది దేవుని దయవలననే, ఆయన కృప మనమీద పెచ్చుగా ఉన్నందువలననే అది సాధ్యము అవుతుంది. మనము మన పాపముల ద్వారా ఆయనను విసిగించుచున్నను, మనకు ఆహారము దూరముచేసి పస్తులు ఉంచని దేవుని ప్రేమకు నిండు కృతజ్ఞతాస్తుతులు. ఆయన సృష్టించిన దగ్గరనుంచి మానవుని ప్రతి విషయములోను ప్రత్యేకత ఉంచారు. బోజనము విషయములో కూడా విత్తనము కలిగినవి మాత్రమే ఇచ్చారు. మిగిలిన జంతువులకు పచ్చని మొక్కలు, విత్తనము లేనివి ఇవ్వటము జరిగినది. ఈ విత్తనము మనము మనలో కలిగి ఉన్న ఆయన స్వరూపము, పాలికెకు గుర్తుగా ఉన్నది . మనము ఆ విత్తనములను చూసినప్పుడల్లా దీనిని గురించి జాగ్రత్త, వహించేలాగున మనకు జ్ణాపకము చేయుచున్నది. మరియు విత్తనము అనేది దేవుని వాక్యమునకు కూడా సూచనగా ఉన్నది. ఈ ఫలములు అన్ని శరీరానికి, మన ఆత్మకు మాత్రము దేవుని వాక్యమైన విత్తనమే ఆహారము. ఫలము మన ఫలింపు విషయమై కూడా మనకు హెచ్చరికగా ఉన్నది. ఈ ఆత్మ స్వరూపము, పోలికె వీటిలో లేనందున జంతువులకు విత్తనములతో కూడిన ఆహారము నియమింపబడలేదు. దేవుడు చేసే ప్రతి పనిలో అంతరార్ధము దాగి ఉన్నది.
ఈ వచనములను బట్టి మనుష్యులు, జంతువులు ఇద్దరూ కూడా శాకాహారులే అనే విషయము మనకు స్పష్టముగా అర్థము అవుతుంది. నోవహు జలప్రళయము తరువాతనే దేవుడు మనిషికి మాంసాహారము తినటానికి అనుమతి ఇవ్వటము జరిగినది. మొదటిగా దేవుడు ఎక్కడా కూడా హింస అనేదానికి ప్రాథాన్యత ఇవ్వలేదు. అంతా perfect harmony లో ఉన్నది. మనిషి పాపము చేసిన తరువాతనే సృష్టి యొక్క స్వరూపము, order అనేది మారిపోయినది. తిండి అనేది కేవలము మన శరీరము పోషణ కొరకు, దాని ద్వారా శక్తి అనేది సంపాదించుకుని దేవుడు మనకు నియమించిన కార్యములు చేయటానికి. అయితే ఇది అధికముగా తినుట, అనగా తిండిబోతుతనము అనేది కూడా ఒక పాపము అని లేఖనము మనలను హెచ్చరిస్తుంది. అందుకే బోజన ప్రియత్వము అనేదానికి మనము బందీ అవకూడదు. ఎక్కువ తిండి తినటము వలన మన శరీరమునకు మత్తు అనేది ఆవహించి/ఆవరించి మెదడు చురుకుగా పనిచెయ్యకుండా బద్దకము కలిగిస్తుంది. అందుకోసము మనము దేవుని చేత చేయబడలేదు అని గుర్తించాలి. అలానే దేవుడు మనము తినదగినవి, తినకూడనివి లేఖనములలో చెప్పటము జరిగింది. మన ఆరోగ్యమును కాపాడుకునే బాధ్యత మనదే కాబట్టి వీటి విషయములో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. మనము ఆహారము తీసుకునే ప్రతిసారి దేవునికి కృతజ్ణతా స్తుతులు చెల్లించాలి. అది మన అనుదిన జీవితములలో దేవుని ఫ్రేమకు గొప్ప సాదృశ్యముగా ఉన్నది. మనము దానికి తగిన గౌరవము ఇవ్వకపోతే దేవుని ప్రేమను తృణీకరించినట్లే అవుతుంది. అందుకే మనము అకలిగొనకుండా, అటు మత్తులము కాకుండా తగినంత ఆహారము తీసుకుని దేవుని పనిలో నిమగ్నమై ఉండాలి.
ఈ విధముగా దేవుని ప్రేమ మరియు కృప ద్వారా మనకు లభించిన ఈ ఆహారము గురించి మనము చింత కలిగి ఉండవలసిన అవసరము లేదని పరిశుద్ధ గ్రంధము మనకు సెలవిస్తుంది. ఆకాశపక్షులను పోషించుచున్న దేవుడు మనలను అంతకన్నా గొప్పగా పోషించగలడు అనే భరోసా ఇస్తుంది. ఇందుకు దృష్టాంతముగా ఏలియాను గురించిన రెండు గొప్ప దృష్టాంతములు మనకు లేఖనములలో ఇవ్వబడినాయి. మొదటిది అతను కాకుల చేత పోషించబడటము, రెండు దేవదూత ఇచ్చిన రొట్టె ద్వారా అతను గొప్ప ఎడారిని దాటగలగటము, మోషే కూడా దేవుని సన్నిధిలో రెండు పర్యాయములు 40 దినములు (40 పగళ్లు, 40 రాత్రులు) ఆహారము, నీరు లేకుండా గడపడము జరిగినది. వీరు ఇద్దరూ కూడా దేవుని యొక్క మాటకు లోబడి ఆయన నీతిని, రాజ్యమును వెతుకుతూ ఉన్నప్పుడు ఈ విధముగా దేవుడు అద్భుతమైన రీతిగా వారికి సమకూర్చడము జరిగినది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ విషయమునే కొండమీది ప్రసంగములో చెప్పటము జరిగినది. తన శిష్యులతో కూడా సమరయ మార్గములో బావి దగ్గర ఉన్నప్పుడు దేవుని చిత్తము నెరవేర్చుట తనకు ఆహారము అని కూడా చెప్పటము జరిగినది. దీనిని బట్టి మనము ఆత్మ సంబంధమైన విషయముల మీద శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు శరీర సంబంధ ఆహారము గురించి చింతించవలసిన అవసరము లేదు అనే విషయము స్పష్టమవుతుంది. ఉపవాసము అనేది కూడ మన శరీరమును బాదపరచుకొనుటకు కాదు గాని శరీరము కన్నా ఆత్మకు అధిక ప్రాథాన్యము ఇచ్చుటకే దీనిని దృష్టిలో పెట్టుకుని మనము ఆత్మ సంబంధంమైన విషయముల కొరకై ఎక్కువ ఆసక్తి , ఆతురత కలిగి ఉండాలి అప్పుడు దేవుడు మన దేహమునకు అవసరమైన అవసరతలు తీర్పును.