వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను (1:4).
దేవుని ద్వారా దయచేయబడినది ఆయన కలిగివుండేది ఎప్పుడు కూడా మంచిదే ఉంటుంది. ఏ మాత్రము మంచితనము లేకుండా ఒకవేళ చెడు అనేది లేశమాత్రమును కలిగి ఉన్నా అది దేవుని దగ్గర ఉండదు. ఆయన ఎదుటివారికి దానిని ఇవ్వడు. అది ఆయన పరిశుద్ధతకు, స్వభావమునకు ఆనవాలు. ఆయన కూడా మనకు ఇచ్చేముందు దానిని పరిశీలించడము అనేది ఆయనకు మనమీద ఉన్న శ్రద్ధకు గొప్ప తార్కాణము. ఇవి అన్నీకూడా మన నిమిత్తమే పరిశీలనకు గురి అయ్యాయి. భూమి పునాది వేయకముందే ఆయన ప్రణాళికలో మనము ఉన్నాము అని లేఖనము సెలవిస్తుంది. ఇవి అన్నియు మనలను దృష్టిలో పెట్టుకుని చేయబడినవి కాబట్టి మనకు ఏ కోణంలోనూ ఇబ్బంది, చెడు అనేది కలగకుండా పరిశీలనకు గురికాబడ్డాయి. సమస్తము మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన వాటి ఉనికిని కొనసాగించటము జరిగినది. వేరే ఎవరికీ కూడా ఈ పర్యవేక్షణ బాధ్యత అప్పగించకుండా ఆయనే స్వయముగా పరిశీలించడము అనే చర్యను మనము గమనించినప్పుడు అందులో ఉన్న ప్రేమను ఎలాగు వివరించగలము
ఏదైనా ఒక విషయమును మంచి అని కానీ చెడు అని కానీ నిర్ణయించాలి అంటే అందుకు సరైన వ్యక్తి, అర్హత ఉన్న వ్యక్తి దేవుడు మాత్రమే అని చెప్పటములో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఈ వచనము ప్రకారము ఆయనే initative తీసుకుని ఏది మంచిది అని తెలియజేయటము జరిగినది. సాధారణంగా మానవులు ఏదైనా తీసుకోవలసి వచ్చినప్పుడు ప్రతి వస్తువు మంచిదా కాదా ఏమైనా లోపములు ఉన్నాయా అని పరిశీలిస్తూ ఉంటారు. అయితే మంచి లేదా చెడు అనే నిర్ధారణ వారి శ్రమను బట్టి, సామాజిక జీవితముకొరకు వారు ఏర్పరుచుకొన్న నియమములను బట్టి, వారి జీవితములో వారు ఎదుర్కొన్న పరిస్థితులద్వారా కలిగి ఉన్న అనుభవమును బట్టి ప్రభావితము చెందుతుంది. ఈలాగున చెయ్యటము కూడా సరైన పద్ధతి కాదు. అది పక్షపాత నిర్ణయము అయ్యే అవకాశము ఉంది. కానీ దేవుడు ఆలాగున కాకుండా ఎప్పుడూ న్యాయవంతముగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఆయన నిర్ణయములు సరైనవి. అందుకే మంచికి, చెడుకు ఆయన వాక్యమును మనము ప్రమాణముగా తీసుకోవాలి. అది మనకు లాభసాటిగా ఉన్నా, నష్టం కలిగించినా కూడా. మన జీవితంలో న్యాయ ప్రమాణములు అనేవి ఆయన వాక్యానుసారము ఉన్నట్లయితే భూలోకము ఎప్పుడూ పరలోకములానే ఉంటుంది. ఆయన చిత్తముకూడా అదే అని ప్రభువు నేర్పిన ప్రార్థన ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ప్రమాణములను వెంబడిద్దాము. అందరమూ సంతోషముగా కలిసి జీవిద్దాము
ఇక్కడ దేవుడు మంచి అని పలికిన పదం కేవలము ఆయనకు మాత్రమే మంచి కాకుండా, ఇతరులకు కూడా మంచినే కలిగిస్తుంది అని ఆయన ఉద్దేశ్యము. ఆలాగుననే మనము చేసే పనులు, తయారుచేసేవి కేవలం మనకు మాత్రమే మంచిచేసేవిగా కాకుండా అందరికీ మంచిని పంచేవిగా ఉండాలి. ఒకవేళ మనకు మంచి జరిగి, దాని ద్వారా ఇతరులకు ఏదైనా కీడు అనేది సంభవించే అవకాశము ఉంటే మనము ఆ పనులను చేయకుండా, విడిచిపెట్టుట మంచిది.
మనము చేసిన ప్రతి వస్తువుకు కూడా నాణ్యత ప్రమాణము (quality standard) పరిశీలన చేస్తాము. ఆ అలవాటు మనకు దేవునినుంచి ఈ వాక్యము ద్వారానే సంక్రమించింది అని చెప్పవచ్చు. ఆయన ప్రతి విషయంలోనూ మనకు మాదిరిగా ఉన్నాడు. చెప్పటము మాత్రమే కాకుండా ఆయన జీవించి చూపించి, మనలను వెంబడించండి అని తెలియజేయటము ఆయనకు ఉన్న ఏకైక గొప్ప లక్షణము. దేవుడుగా మన ప్రభువుగా ఆయనను కలిగి ఉన్న మనము నిజముగా ధన్యులము.
మనము చేసిన పనులను పరిశీలించుకోవాలి (review) అనే విషయము, అది మంచిగా ఉందా లేదా అనేది కూడా సరిచూసుకోవాలి అని మనకు నేర్పిస్తున్నారు. దీనివలన మనకు కలిగే అనేక నష్టములనుంచి ప్రమాదములనుంచి బయటపడే అవకాశము కలుగుతుంది. చివరలో భంగపాటునకు గురిఅయ్యే కన్నా ముందుగా సరిచేసుకోవడమే చాలా ఉత్తమము