దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను (1:20-23).
పక్షులు ఆకాశములో ఎత్తులో ఎగురుట ద్వారా వాటికి high level view అనేది లభిస్తుంది. దానిద్వారా భూమిమీద ఆ యా వస్తువులు ఆ ప్రాంతములలో ఎందుకు ఎలా అమర్చబడి ఉన్నాయి అనే విషయము అర్థము అవుతుంది. మనము ప్రయాణిస్తున్న మార్గము ఎటు తీసుకువెళుతుంది అని అవగాహన కూడా మనకు లభిస్తుంది. ఈ high level view వలన మన జీవితములో జరుగుతున్న పరిస్థితులను వాటి వెనక గల దేవుని ప్రణాళికను గురించిన అవగాహనను పొందుకొనగలము. దేవుని సృష్టియొక్క అందమైన landscape ని కూడా మనము పైనుంచి వీక్షించటము ద్వారా ఆనందించవచ్చు. ఆయన చేతిపనుల యొక్క ఎత్తు, పొడుగు, వెడల్పు ఏమిటి అనేది అప్పుడు మాత్రమే గ్రహించగలుగుతాము. ఒకవేళ నీ జీవితములోని సంఘటనలు అలా ఎందుకు జరుగుతున్నాయి అనే విషయము అర్థము కాకపోతే ప్రార్ధనలో దేవుని సమీపించుట ద్వారా సమస్తము గ్రహించగలము. ప్రార్ధన వలన మన జీవితమునకు ఈ విషయములలో స్వాంతన కలుగుతుంది. ధైర్యము లభిస్తుంది. ప్రార్థన చేసే వ్యక్తులు దేవుని యొక్క మనస్తత్వమును కూడా త్వరగా అర్థము చేసికొనగలుగుతారు. అలాంటి కుటుంబములు కలిసిమెలిసి ఉంటాయి. దేవుడు నీవు ఉన్న పరిస్థితులలో నిన్ను ఎందుకు ఉంచారు అనేది గ్రహించటానికి ఆయన ప్రణాళిక గ్రహించటానికి ప్రార్థన చేయండి.
ప్రార్థనద్వారా మన భారములు తేలిక చేయబడతాయి. అప్పుడే మనము పక్షిలాగా ఆకాశములో ఎగరగలుగుతాము. పక్షులు విత్తవు కోయవు. వాటి పోషణ నిమిత్తము దేవుని మీద ఆధారపడతాయి అని లేఖనము సెలవిస్తోంది. అందుకే అవి లేనిపోని భారములు పెట్టుకోవు. ఇహిక విచారములు వలన మనలో భారము పెరిగిపోయి, ఎగరలేని పక్షివలె ప్రార్థన చేయలేక నిరుత్సాహమునకు గురిఅయి కృంగిపోతాము. కానీ మనము దేవునికి ప్రార్థన చేసినయెడల ఆయన సమస్త బంధకములనుండి మనలను విడిపిస్తారు అని లేఖనము సెలవిస్తుంది. నీ భారము యెహోవా మీద మోపుము, నీ చింత యావత్తు నామీద వేయము, పక్షులను చూసి నేర్చుకొనుము అనే వాగ్దానములు మనకు లేఖనములలో అనేకము ఉన్నను మనమింకా మన అనుదిన పోషణ గురించి విచారించటము దురదృష్టకరము. పక్షులు ఎలాగైతే ఆయనకు సమీపముగా, ఆయన రాజ్యమును నీతిని వెతుకుతున్నాయో, మనము కూడా అలాగు చేసిన యెడల దేవుడే మన పోషణ బాధ్యత వహించి మన ప్రయాసమును తీసివేస్తారు. నేను తీసివేస్తాను అది నాకు వదిలిపెట్టు అని దేవుడు చెప్పిన తర్వాత కూడా మనము దానిని మోయాలి అనుకోవటము బుద్ధిహీనత అవుతుంది. ఈరోజే ప్రార్థన చేయటము ఆరంభించు. నీ బారములు అన్నీకూడా తేలిక చేయబడతాయి.
పక్షులు వేసవికాలములో నీరు దొరకనప్పుడు అవి వాటికోసము ఎన్నో గొప్ప దూరములు ప్రయాణము చేస్తాయి. మనము కూడా ఒకవేళ మనము ఉన్న ప్రదేశములలో వాక్యము సమృద్ధిగా లభించకపోతే అది దొరికే ప్రాంతమునకు చేరుకోవాలి. అది ఎంత దూరము అయినా సరే. మనకు ధనము ఇచ్చే ఉద్యోగముల కొరకు ఎంత దూరమైనా ప్రయాణము చేస్తాము. రోజులో ఎన్నో గంటలు దాని కోసము ఖర్చుచేస్తాము, కానీ ఆ డబ్బు శాశ్వతకాలము మన దగ్గర ఉండదు. అయితే దేవుడు ఇచ్చే నిత్యజీవము ఎల్లవేళలా మనతో నిలిచిఉంటుంది. మరి దానికోసము ఇంకా ఎంత ప్రయాసపడాలి అనేది గ్రహించాలి. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు మన ప్రాణము దేవుని కొరకు ఆశపడాలి. అది వాక్య ధ్యానము, ప్రార్థన ద్వారానే సాధ్యము అవుతుంది. మనము ప్రయాసపడటానికి ఇష్టపడక నీరు దొరకని ప్రదేశములో నిలిచి ఉంటే అది మన మరణమునకు దారితీస్తుంది.
ఒకేజాతి పక్షులు ఒకేచోట కలిసి జీవనము సాగిస్తాయి. అవి బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా గుంపుగానే వెళతాయి. అలానే ప్రార్థనలో మనము ఇతరులతో కలిసి ఉండాలి. అలా గుంపుగా ప్రయాణము చేయటము వలన అవి ఎక్కువ దూరము ప్రయాణము చేయగలుగుతాయి. అలానే ప్రార్థనలో కలిసి చేయుటద్వారా దేవునికి అతి సమీపముగా చేరాతాము. దేవుడు కూడా ఇద్దరు లేక ముగ్గురు కూడినపుడు అని చెప్పారు తప్ప ఒక్కరిగా ప్రోత్సహించలేదు. team work is must in prayer.
చేపలు లాగానే పక్షులు కూడా వాటి పిల్లలను వాటి సమీపమున ఉండి పెంచి పోషిస్తాయి. దగ్గరఉండి వాటికి ఎగరటము వేటాడటము నేర్పిస్తాయి. ప్రమాదము సంభవించినప్పుడు వాటి రెక్కల క్రింద పిల్లలను దాచిపెడతాయి. వాటిని రెక్కలమీద పెట్టుకుని మోసుకువెళతాయి. ఈ విధముగా మనము మన పిల్లలతో కలిసి ప్రార్థన చేయాలి. వారికి ప్రార్థనద్వారా దేవునికి సమీపముగా జరగటము నేర్పించాలి. వారి అంతట వారు ప్రార్థన చేయటము నేర్చుకునేవరకు వారితో మనము కూడా ప్రార్థన చేయాలి. వారిని ఒంటరిగా విడిచిపెడితే ఎగరలేక నేలమీద పడిపోయే ప్రమాదము ఉన్నది. పరిపక్వత (perfection) సాదించేవరకు తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి.