దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (1:26-28)
మనము మన సంతానమును ఎలా పెంచాలి అనే దానికి కూడా దేవుడు మనపట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశ్యమును ఇక్కడ బయలు పరచటము జరిగినది. ఆయన ఆశీర్వాదములో ఆయన చిత్తము ఆ జీవరాసి పట్ల ఏమైయున్నది అనేది దాగియున్నది. దానికి తగినట్లుగానే అవి జీవించి వాటి తరువాత వాటి సంతానమును జీవింపచేయాలి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము ఆ తరము వరకు మాత్రమే కాదుగాని భూమి, ఆకాశము నిలిచి ఉన్నంతవరకు అని అర్థము చేసుకోవాలి. ఆ విధముగా ఆశీర్వాదము కొనసాగాలి అంటే ముందు ఉన్న తరము, తరువాతి తరమును సిద్ధముచేయుట అనేది కీలక విషయము. అందుకే దేవుడు తాను సృజించిన మొదటి తరమునుంచే సమస్తమును మొదలుపెట్టి బలమైన పునాది వేయటము జరిగినది. మన ఆది తల్లి తండ్రిలు చిన్నతనము బాల్యము అనేది లేకుండా వారిని యుక్త వయస్సు గలవారిగా దేవుడు సృజించటము తయారుచేయడము జరిగినది. బాల్యములో ఉంటే దేవుడు చెప్పిన సంగతులు వారికి అర్ధము కాదు. తానే వారికి తల్లి, తండ్రి అయ్యి పిల్లలను ఎలా పెంచాలి అనే దానికి గొప్ప ఉదాహరణ ఇవ్వటము జరిగినది. ఆయన ద్వారా parenting అనుభవించిన మన మొదటి పితరులు ధన్సులు, అంతకుమించిన అదృస్టము ఈ లోకములో మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. అది మరలా మనుష్యులకు ప్రభువన యేసుక్రీస్తు ద్వారా లభించినది. నీవు ఒక మంచి పేరెంట్ గా ఎలా ఉండాలో ఆయనను చూచి నేర్చుకున్నావా?
మనము మన సంతానము విషయములో గొప్ప బాద్యత కలిగి ఉన్నాము. రాజు యొక్క కుమారుడు రాజు తరువాత రాజు అవుతాడు కాబట్టి అతని శిక్షణ విషయములో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. చిన్నతనము నుంచి వారికి లేఖనములను అనుసరించి దేవుని లక్షణములను, ఆయన మన జీవితములో కలిగి ఉన్న పాత్రను, ఆయన ఎందుకు గర్భఫలము ద్వారా ఆ బిడ్డను ఇచ్చినది, అతని జీవితము పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక సమస్తమును వివరించాలి. అయితే ఈ రోజున తల్లితండ్రులు . లోకములో ఎలా గొప్పగా బ్రతకాలి, ఏ కోర్స్ చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది, మిగతావారిని దాటుకుని ముందుకు ఎలా వెళ్లాలి అనే విషయములను బోధించి, అవి సాధించటానికి దేవుని దగ్గరకు ఎలా వెళ్లాలి అనేదే నేర్పిస్తున్నారు. ఇది చాలా దురదృష్టము. మన ప్రణాళికలు, చిత్తము నెరవేర్చుకొనుటకు దేవుని ఎలా ఉపయోగించుకోవాలి అని కాకుండా ఆయన చిత్తము, ప్రణాళిక ఏమై ఉన్నాయో తెలుసుకోవటానికి, దేవుని దగ్గరకు వెళ్లాలి. దానిని వారి తరములో నెరవేర్చి, వారి తరువాతి తరమును వారి ప్రణాళిక కొరకు ఎలా సిద్ధము చేయాలో నేర్చుకోవాలి, మనము దేవునితో సంబంధము కలిగి లేకపోతే లోకములో నశించిపోతాము. మన నిజమైన ఫలింపు తరతరముల వరకు నిలిచి ఉండాలి అంటే ఆయన చిత్తము అనుసరించటము తప్ప మనకు వేరే మార్గము లేదు. మరి నీవు ఆయన చిత్తము కొరకు ఎలా సిద్ధపడుతున్నావు? నీవు దేవుని కొరకు జీవిస్తావా? లేక లోకము కొరకా?
తరువాత దేవుడు మనము అభివృద్ధి చెందాలి అని కోరుకున్నారు. మనలో చాలామంది దేవుని దగ్గరకు వస్తే అన్ని వదిలిపెట్టుకుని వైరాగ్యములో బ్రతకాలి, ఇంక జీవితములో అభివృద్ధి అనేది ఉండదు అనుకుంటారు. అయితే దేవుడు ఈ యొక్క ఈ దీవెన ద్వారా దానికి తగిన సమాధానము దయచేశారు. తన దగ్గరకు వచ్చిన వారి జీవితములు అంతకంతకూ అభివృద్ధి చెందాలి అనేది ఆయన చిత్తము. ఈ రోజున మన జీవన పరిస్థితులు చూసుకుంటే ఆ విషయము మనకు స్పష్టముగా అర్థము అవుతుంది. అయితే మనము అభివృద్ధి చెందటానికి లోకములో రకరకాల పద్దతులను అవలంబిస్తాము. అయితే అవినీతిని అనుసరించానా, లేక చెడును అనుసరించానా అనే ఆలోచన చాలామందికి ఉండదు. వారికి వారి అభివృద్దే ప్రధానము. అయితే దేవుడు నీతిని అనుసరించిన అభివృద్ధి మాత్రమే మన జీవితములో ఉండాలి అని కోరుకుంటున్నారు. మనము ఆత్మలో ఫలించిన కొలది అన్ని విషయములలోను ఫలించాలి అని దేవుని లేఖనము సెలవిస్తుంది . లేఖనమును అనుసరించకుండా, ఆత్మలో ఫలించకుండా దేవుని దగ్గరనుంచి అభివృద్ధి అనేది మాత్రము ఆశించడము సరైన పద్దతి కాదు. అయితే ఈ రోజున ప్రపంచములో చాలామంది దృక్పదము ఇలానే ఉండటము దురదృష్టకరము, మనము సరైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి చెందినప్పుడే దేవునికి మహిమ, అది ఆయన ద్వారా మరింత దీవెనకు గురి అవుతుంది. లేనియెడల దేవునికి అవమానము, దానికి శాపము కలుగుతాయి.