మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను (1:6-8).
ఈ విధముగా లోకములోనుండి వేరుపడి బ్రతకడము అనేది మనకు అసాధ్యంగా అనిపించవచ్చు. అయితే మనలో మంచి క్రియను మొదలుపెట్టిన దేవుడు దానిని అంతమువరకు కొనసాగిస్తాడు అని లేఖనము సెలవిస్తోంది. ఆ క్రమములో ఆయన నమ్మదగినవాడు. మనము సహకారము ఇవ్వటమే ఇందులో ప్రధానమైన అడ్డంకి అని మనము గుర్తించాలి. చేయి అందిస్తే పట్టుకుని నడిపించటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా అందుబాటులో ఉన్నాడు. దానికి అవసరమైన అన్ని వనరులు దేవుడు మనకు దయచేసారు. పరిశుద్ధాత్మఅభిషేకము, సహవాసము, దేవదూతల పరిచర్య అనేవి, లేఖనములు మన స్వంత భాషలో మనకి అందుబాటులోనికి తీసుకుని రావటము, మనము కొనగలిగిన స్థాయికి వాటిని అందుబాటులోనికి తేవటము ఈ క్రమములో భాగములు. ఈ ప్రక్రియ మొత్తములోను దేవునికి లాభసాటి కలిగించేది ఏది కూడా లేదు. కేవలము మనకు మాత్రమే అన్నివిధాలా లాభము. ఇక్కడ ఇబ్బందిలో ఉన్న మనము ఆయన వెనకాల పడాల్సింది పోయి ఆయన మన బాగు కోసము మన వెనుక పడడము ఆశ్చర్యము. ఆయన స్థాయి ఏమిటి మన స్థాయి ఏమిటి అని ఆలోచించినప్పుడు సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్ధము కావడము లేదు. ఇప్పటికైనా తెలివి అనుకునే మన మూర్ఖతను విడిచి పెడదాము. మన తండ్రి చెంతకు చేరి ఆయనకు ఆనందము కలిగిద్దాము
మనము ఆయన మాటప్రకారము నడుచుకున్నట్లయితే పరలోకములో ఆయన మనకొరకు చేసిన ఏర్పాట్లు చాలాగొప్పగా, వర్ణించటానికి కూడా సాధ్యముకాని రీతిగా ఉన్నాయి. ఆయన పైన మేఘములలో బిగించిపెట్టిన జలముల ద్వారానే మనము భూమిమీద మనుగడ సాగించడానికి అవసరమైన వర్షము దయచేయబడుతుంది. దానినుంచే దేవుని యొక్క తీర్పు కూడా భూమిమీదకు వస్తున్నది. మనము దేవునిలో గల ఈ రెండు వ్యతిరేక లక్షణములను గమనించినప్పుడు ఒకింత ఆయనను అపార్థము చేసుకునే ప్రమాదము ఉన్నది. మన పిల్లలు దారి తప్పినప్పుడు వారిని మందలించకపోతే, క్రమశిక్షణ చేయకపోతే వారు అంతకంతకూ చెడిపోతారు, అదే శ్రద్ధ దేవుడు మనయెడల కనపరుస్తున్నారు. దానిని మనము కోపముగాను, ప్రతీకారముగాను భావించకూడదు. నరకమునకు ఎవరిని అయినా పంపేముందు వారికి ఇచ్చిన సంవత్సరముల తరబడి అవకాశము మనము గమనించినప్పుడు అది అర్థము అవుతుంది. నరకమునకు వెళ్లటము అనేది మన చేతులారా మనము చేసుకున్న నిర్ణయమే తప్ప దేవుడు స్వయముగా మనలను పంపలేదు అనే విషయము ఇక్కడ మనము గమనించాలి. చెడు సమాజమునకు cancer గా పరిణమించినపుడు అది అన్నివైపులావ్యాపించకుండా ఆయన తొలగించడము జరుగుతుంది. దీనిని మనము సరైన దృక్పథంతో అర్థము చేసుకోవాలి. ఆయన ఎప్పుడూ మంచివాడే
మనుషుల మధ్య ఇలా విభజన రావటము అనేది ఆయన హర్షించే కార్యము కాదు. అన్ని చోట్ల అందరూ రక్షణ పొందాలి అనేది ఆయన అభీష్టము. అందుకే ఎన్నిచేసినా సంతోషించని దేవుడు ఒక ఆత్మ రక్షణ పొందితే పరలోకము అంతా ఆనందంతో నిండిపోతుంది అని తెలియజేశారు. అందుకే కాబోలు 2వ దినమున ఆయన చేసిన విభజన దేవుడు మంచిది అని చెప్పలేదు. ఆ మేఘములు లేదా ఆకాశమునుండి ప్రచండ వర్షము ద్వారాను, మెరుపుల ద్వారాను, ఆయన శిక్ష విధించవలసి వచ్చినప్పుడు అది ఆయన మనస్సునకు సంతోషము కలిగించలేదు అని మనకు అర్థము అవుతూ ఉంది. దీనినిబట్టి ఆయన కనికరమును కోరుకునే దేవుడే తప్ప శిక్ష విషయములో మనలను బాధించి ఆనందించే దేవుడు కాదని మనకు అర్థము అవుతుంది. మన ప్రవర్తన, విధేయత ద్వారా ఆయన మనస్సు సంతోషింపజేసి దీవెన, ఆశీర్వాదము పోందుకునేలా ఉండాలి తప్ప, అవిధేయతతో ఆయనను శోధించేవారముగా ఉండకూడదు. కుమారులను, కుమార్తెలను శిక్షించి ఆనందించే తల్లిదండ్రులు ఎవరూకూడా ఉండరు అనేది లోకవిధితమే. ఆయన పాపమునకు సంపూర్ణమైన తీర్పు విధించు దినము రాకముందే మేల్కొందాము. మన రక్షణకర్త అయిన దేవుని వైపు తిరిగి పరలోకములో స్థానము సంపాదించుకుందాము