ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (1:1).
దేవుని అన్నిటికన్నా ముందుగా పెట్టుకోవాలి
పరిశుద్ధ గ్రంథము అన్నింటికన్నా ముందుగా దేవుని ఉంచటము జరిగినది. ఆయన పరిచయముతోనే సమస్తము ఆరంభించడము జరిగినది. చివర ముగింపులో కూడా దేవునితోనే ముగించటము జరిగినది. అనగా ఆదియు, అంతము ఆయనతోనే అనే గొప్ప లేఖన సత్యము మనకు తెలియజేస్తుంది. సాధారణముగా మనము కార్యములు ఆరంభించి దానిలో సమస్యలు ఎదురైనప్పుడు దేవుని దగ్గరకు వస్తాము. లేదా కార్యము ఆరంభించినప్పుడు ఏ ఆటంకములు జరగకూడదు అని ఆయనకు ప్రార్థిస్తాము. అంతేకానీ ప్రతి విషయములోను ఆయనను భాగస్వామిగా చేసుకుని మన జీవితము కొనసాగించము. అయితే దేవుడు మనలో నివాసము చేయాలి అని మనతో భాగస్వామి కావాలని ఆశిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములోని ఎన్నో అద్భుతమైన సంగతులు దేవుని ద్వారా సామాన్య మానవులు ఏమి చేయగలిగారు అనేది మనకు తెలియజేస్తాయి. ఇంత గొప్ప సృష్టిని చేయగలిగిన జ్ఞానము కలిగిన దేవునికి మనము ప్రధమస్థానము ఇచ్చినట్లయితే మన జీవితము, దాని కార్యములు కూడా ఎంతో అద్భుతముగా తీర్చిదిద్దబడతాయి. ఆయన సలహాలు సూచనలు ఎంతో మేలుకరముగా ఉంటాయి. అందుకే కార్యము మధ్యలోనో చివర్లోనో కాకుండా ఆరంభమునుంచే ఆయనతో కలిసి నడుద్దాము. గొప్ప కార్యములు సాధిద్దాము
ఆయన ఇచ్చిన బహుమానము జాగ్రత్తగా కాపాడుకోవాలి
మనకు ఎవరైనా ఒక బహుమానము ఇచ్చినప్పుడు దానిని ఎలా జాగ్రత్త చేస్తున్నాము, ఎంత అపురూపంగా చూసుకుంటున్నాము అనే దానిమీద ఆ వ్యక్తిమీద మనకు ఉన్న గౌరవము, ప్రేమ ఆధారపడి ఉంటాయి. దేవుడు మనకు ఇచ్చిన బహుమానము గమనించినప్పుడు ఆయనకు మనమీద ఉన్న ప్రేమ ఎలాంటిది, అనురాగము, అభిమానము ఎంత ఉన్నాయి అనేది దాన్ని తీర్చిదిద్దిన తీరులో స్పష్టముగా కనిపిస్తుంది. ఈ బహుమానము మనము నిర్లక్ష్యముగా ఉపయోగించడము దానిని పాడుచేయడం గమనించినప్పుడు మనకు ఆయనమీద అలాంటి ప్రేమ, అభిమానమ లేవు అర్థం అవుతుంది. మనము ఇచ్చిన బహుమానము ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే మన మనసుకు ఎంత బాధ కలుగుతుందో చెప్పవలసిన అవసరము లేదు. మనము దేవుని ప్రేమిస్తున్నా అని కేవలం నోటిమాటతో చెప్పటము కాకుండా దానిని క్రియల రూపములో చూపించాలి. మన మాట, క్రియలు ఒకే విషయాన్ని ప్రతిబింబించాలి. విరుద్ధముగా ఉండకూడదు. ఈ భూమి పట్ల మనము అందరమూ కూడా బాధ్యత కలిగి ఉన్నాము. ఆయన ప్రేమకు కృతజ్ఞత కలిగి జీవిద్దాము.
ఆయనే మన ఆరాధనకు అర్హుడు పూజ్యనీయుడు
సృష్టించబడిన దానికన్నా సృష్టించినవాడే గొప్పవాడు. సృష్టించబడినది ఏదీకూడా సృష్టికర్తకు సమానము కాదు. లోకములో ఉన్నటువంటి అనేక మతములు, ఆచారములు సృష్టిని పూజిస్తున్నాయి. అయితే దేవుడు తన గ్రంథములో సృష్టముగా వ్రాయించారు. సమస్తము తనద్వారానే చేయబడినది అని. అందుకే మనము మనుషులను కానీ, ప్రకృతినిగాని పూజింపకూడదు. దేవుడు ఒక్కడే మన ఆరాధనకు, పూజకు అర్హుడు. మనుషులు దేవుని దేవునిగా ఆరాధించకపోవడము వలన వారికి భ్రష్టమనస్సు కలిగినట్లుగా మనము చూస్తున్నాము. సృష్టించబడినది సృష్టికర్తను తిరస్కరిస్తే అది అహంకారము, తిరుగుబాటు అవుతుంది. ఈ లోకరీతిగా చూసినాకూడా వీటికి శిక్ష అనేది విధించబడుతుంది. అదే విధముగా సృష్టికర్తను మరచి సృష్టమును పూజించువారు కూడా శిక్షకు గురి అవుతారు. అందుకే మనము నిజమైన దేవుని ఆరాధించాలి. ఆయనను మాత్రమే పూజించాలి. పరిశుద్ద గ్రంధము ఈ విషయమును చాలా సృష్టముగా తెలియజేస్తుంది. అది ఏమిటి అంటే అయన తప్ప వేరొక దేవుడు లేడు అని.