దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గలవాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. (1:24-25)
జంతువులు రాత్రి సమయములో కూడా చూడగలుగుతాయి. వాటి కన్నులు మెరుస్తూ ఉంటాయి. అలానే సేవకులుగా ఉన్నవారు తమ కన్నులకు వెలుగు కలిగి ఉండాలి. ఆయన వాక్యమును మన పాదములకు దీపముగా చేసుకోవాలి. పామువలే వివేకముగా ఉండమని చెప్పిన ప్రభువు యొక్క మాటను బట్టి శోధన సమయములో వివేచన ద్వారా మెలకువగా ఉంది తప్పించుకోవాలి. జంతువులు రాత్రి సమయములలో తమ senses ఎక్కువ ఉపయోగిస్తాయి. అలానే మనము కూడా alert గా ఉండాలి. ప్రమాదములను పసిగట్టాలి. మనము సాతాను యొక్క తంత్రములను ఎరుగనివారము కామని పరిశుద్ద గ్రంధము తెలియజేస్తుంది. కాబట్టి alert గా లేకుండా మనము పడిపోతే భాద్యత మనదే. మనము లేఖనములను సరిగా ధ్యానించకపోవుట వలననే ఇది జరుగుతుంది. దేవుని వాక్యము మన కన్నులకు వెలుగిస్తుంది. దానితోనే మనము చీకటిలో సహితము చూడగలిగిన శక్తిని పొందుకుంటాము. లేనియెడల మనము శోధన సమయములో తొట్రిల్లే అవకాశము ఉన్నది. ప్రభువు మనకు కాపలాగా ఉన్నారు అనే విషయము ఎప్పుడూ మరచిపోవద్దు. భయపడవద్దు.
సాధు చేయబడుటకు ఇష్టము లేక తిరుగుబాటు మనస్తత్వము, దుష్ట స్వభావము కలిగిన వ్యక్తులను పరిశుద్ద గ్రంధము అడవి జంతువులతో పోల్చటము జరిగినది. అయితే వాటికి కూడా దేవుడు ఆయుష్షు అనేది దయచేసారు. త్రాగటానికి నీరు, ఆహారము సమకూరుస్తున్నారు. ఇవి అన్నీ కూడా దేవుడు మనకు కేవలము తన కృప ద్వారా ధాయచేసిన అవకాశములు అని గుర్తించాలి. దేవుని యొక్క పద్దతిని అనుసరించి సేవకులముగా మనము కూడా వారికి అవకాశము దయచేయాలి. ప్రభువు కూడా తన మరణ సమయములో అలాంటివారికి సత్యము గురించి తెలుసుకునే అవకాశము ఇచ్చారు. వారిని ద్వేషించకూడదు. సాధు జీవులను వేటాడినట్లుగా ఇలాంటివారు దేవుని సేవకులను వేటాడి చంపటానికి ప్రయత్నము చేస్తారు. అయితే మనము హతసాక్షులము అవ్వాలి అని ప్రభువు చిత్తమైతేనే మనము వారి చేతికి చిక్కుతాము. లేనియెడల వారు ఎన్ని ప్రయత్నములు చేసినను మనము తప్పించబడతాము. పేతురు, యోహానులే మనకు గొప్ప ఉదాహరణ. నీరో పేతురును శిలువ వేయగలిగాడు గాని ఎంత ప్రయత్నము చేసినా యోహానును మాత్రము చంపలేకపోయాడు. ఎవరు ఎన్ని ప్రయత్నములు చేసినా తప్పించబడి అతను చివరకు సహజ మరణము పొందాడు. కాబట్టి ప్రభువు చిత్తమే నెరవేరుతుంది తప్ప అడవి జంతువులు అన్నీ నిన్ను చుట్టుముట్టిననూ అవి నిన్ను ఏమీ చేయలేవు.
పశువులు, జంతువులు (అడవివి కూడా) అయినా కానీ తమ పిల్లలను ఎప్పుడూ నిర్లక్ష్యము చేయవు. అలానే మనము కూడా సేవ సేవ అని చెప్పి పిల్లలను, ఇంటిని నిర్లక్ష్యము చేయకూడదు. రెంటినీ balance చేయాలి. లేకపోతే లోకమంతటినీ రక్షించి మన కుటుంబమును పోగొట్టుకొనవలసి వస్తుంది. ఇంటిని బాగుగా ఏలుట సేవకుని లక్షణములలో ఒకటిగా చెప్పబడినది.
జంతువులకు, పశువులకు తాము ఏ బరువును మోయాలి, ఎంత మోయాలి, ఎంత దూరము మోయాలి అని ఎంచుకునే అవకాశము ఉండదు. అది మొత్తము కూడా వాటి యజమాని యొక్క చిత్తము, ఇష్టము మీద ఆధారపడి ఉంటుంది. తాము లాగే బండి ఎలాంటి స్థితిలో ఉన్నా, తమకు ఇష్టము ఉన్నా లేకపోయినా దానిని యజమాని సమయమును అనుసరించి తీసుకుని వెళ్లాలి. ఒకవేళ పశువునకు ఇష్టము లేకపోతే యజమాని దానిని మార్చుతాడు తప్ప తన ఇష్టము మార్చుకొనడు. సేవకులమైన మనము కూడా మన యజమానుడైన దేవుని చిత్తము అనుసరించి ఆయన సమయములో ఆయన చెప్పిన చోటికి ఆయన ఇచ్చిన భారమును తీసుకొని వెళ్లాలి. కానీ ఈ రోజున చాలామంది సేవకులు తమ ఇష్టము చొప్పున సమస్తము చేస్తూ పేరు మాత్రము ఆయనది పెట్టుకోవటము దురదృష్టము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు లోకములోని యాజమానుల వలె భారభరితమైనవి మన భుజములమీద పెట్టనివాడై ఉన్నందుకు, మన పరిస్థితులను,మనస్సులను అర్ధము చేసికొనువాడై ఉన్నందుకు ఆయనకు కృతజ్ణతలు. అలాంటి యజమాని క్రింద పని చేయగలగటము అదృష్టము. నీవు నీ చిత్తమును అనుసరించి సేవ జరిగిస్తున్నావా లేక ఆయన చిత్తానుసారము చేస్తున్నావా?