దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. (1:11-13)
ఆరిన నేలగా చేసిన భూమిని, లోకము యొక్క పోకడలు అన్నీ ఇంకిపోయే విధముగా చేసిన తరువాత, దేవుడు దానిని సాగుచేసి ఫలవంతమైన భూమిగా చేసినట్లుగా ఈ యొక్క వచనములలో మనకు కనిపిస్తుంది. 2.5 రోజులలో వేరుపరిచినవి ఏవి అయితే ఉన్నాయో, ఇప్పుడు దేవుడు వాటిని తన సృజనాత్మకతతో తీర్చిదిద్ది అందముగా, కనులకు ప్రియమైనదిగా తీర్చిదిద్దుతున్నారు. ఒకవేళ ఆరిన నేలను సాగుచేసి ఫలభరితమైన భూమిగా మార్చకపోతే అది బంజరుభూమిగా మారే అవకాశము కలదు. అప్పుడు అది ఎవరికి ఉపయోగము లేకుండా గచ్చపొదలు, ముండ్లపొదలు పెరగటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ దేవుడు ఆ 2.5 రోజులు కష్టపడి పనిచేసి వేరుచేసినది తన ప్రాణమును సహితము అర్పించి మనలకు విడుదల కలిగించినది మనలను బంజరుభూమిగా మిగల్చటానికి కాదు గాని ఫలించాలి, అందరికీ మాదిరిగా ఉపయోగకరముగా ఉండాలి అని. అందుకే దేవుడు మన జీవితములో అప్పటివరకు ఉన్న దేనినుంచి అయినా మనలను వేరుపరచినట్లు అయితే అది మన ఫలింపు, శ్రేయస్సు కొరకే అని మనము గుర్తించాలి. దేవుడు మనకు హాని కలిగించేది ఏదీ కూడా మనలో కొనసాగింపనియ్యరు. దేవుని మనము అపార్ధము చేసుకొనకుండా ఆయన కలిగిన ఉన్నత ప్రమాణాలను, అర్థము చేసుకుని సహకరిద్దాము. ఆయన క్రియల వెనుక గల ఆంతర్యమును గుర్తిద్దాము
ఏదైనా ఒక నేలను మనము సాగుచేయాలి అనుకున్నప్పుడు దానిని దున్ని అందులో ఉన్న రాళ్లను పెళ్లగించి, మనము వేయబోయే పంటకు దానిని సిద్ద ము చేయటము జరుగుతుంది. అలానే దేవుడు కూడా మనలను ఆయన ప్రణాళికకు సిద్ధము చేస్తారు. రక్షణ ప్రణాళికలో ఆయన వేసే తరువాతి అడుగు ఇదే. మన హృదయమును ఫలభరితమైన భూమిగా సిద్ధము చేయటము. ఈ దున్నబడేటటువంటి క్రమములో పదునైన వస్తువులు ఉపయోగించటము జరిగినట్లుగానే దేవుడు కూడా తన వాక్యము అనే సుత్తి ద్వారా అప్పటివరకు లోకమును అనుసరించట ద్వారా బండబారిన మన హృదయములను బద్దలు చేసి, వాక్యము అనే ఆయన అగ్ని ద్వారా మనలో ఉన్న చెత్తను అంతా కాల్చివేయడము జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియలో మనకు చాలాసార్లు దుఃఖముగా అనిపించినా, బాధ కలిగినా కూడా ఆయన భవిష్యత్తులో మనలను ఎలా మలచబోతున్నారు, ఏమి చేయబోతున్నారు అనేది తెలుసుకొని కృతజ్ఞత నిండిన హృదయముతో సహించుకోవాలి. మనము మరీ ఎక్కువగా ఫలించాలి అని మనలోని పనికిరాని తీగలను ఆయన బయట పారవేస్తారు. ఇక్కడ సమస్తమును కూడా మన మేలునకే చేస్తున్నారు అని గ్రహించి ఇప్పుడు ఒకింత బాధగా అనిపించినా ముందు రాబోయేటటువంటి మహిమను దృష్టిలో ఉంచుకుని ఆయనకు పూర్తిగా సహకరించాలి. డాక్టర్ కు సహకరిస్తేనే మన రోగము నయమవుతుంది.
భూమిని దున్ని సిద్ధము చేసిన తరువాత దానిని తడిపి విత్తనము వేయటానికి భూమిని మెత్తన చేయటము జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ శాతము నీరు మొదటిలాగా చేరుకున్నట్లయితే అది మరలా నిరుపయోగము అవుతుంది. అందుకే తగిన మోతాదులో నీరు అందజేయాలి. అది మరలా ఆయన వాక్యము ద్వారానే జరుగుతుంది. రాతినేలను పడిన విత్తనము మొలకెత్తదు కాబట్టి మనము బాగుగా నూరు శాతము ఫలించి అభివృద్ధి చెందాలి అని ముందుగా దేవుడు వాటిని శుభ్రము చేయటము జరిగినది. మనయెడల సరైన శ్రద్ధ లేకపోతే విత్తనము వేసి నా బాధ్యత నేను నిర్వర్తించాను నీవు ఫలించలేదు అని నెపము మనమీద మోపవచ్చు. కానీ అలా ఏదో పేరుకోసము పనిచేసాము అనిపించుకోవటానికి అన్నట్లుగా ఆయన పని చేయలేదు. మన మేలు మనస్పూర్తిగా కోరుకొని ఏమి చేయాలో అవి అన్నీకూడా sincere గా చేశారు. ఇక్కడ మొదట బాధ కలిగించిన ఆ వాక్యమే దున్నబడుతున్న క్రమము తరువాత ఉపదేశము క్రింద మారి మన హృదయములకు స్వాంతన కలిగిస్తుంది.
అందుకే ఆయన ఉపదేశము మంచువలెను, లేత గడ్డిమీద పడు చినుకువలెను ఉంటుంది అని లేఖనము ద్వారా పరిశుద్ధ గ్రంధము మనకు తెలియజేస్తుంది. ఆదికాండము రెండవ అధ్యాయములో ఆ నీటిఆవిరి ద్వారానే భూమి తడిసినట్లుగా మనకు అర్థము అవుతుంది. ఇది ప్రచండ వర్షము లేదా జలప్రళయము కాదు అని మనము గుర్తించాలి. ముందు గాయము చేస్తున్నట్లు అనిపించినా ఆయన మనలో చీము అంతా పిండటానికే తరువాత ఆయన దానికి కట్టు కట్టటము జరుగుతుంది. ఆయన పరమ వైద్యుడు. మనము రోగము కుదుర్చుకోవటానికి వెళ్లినప్పుడు డాక్టర్ చెప్పిన విధముగా మనము నడుచుకోవాలి తప్ప మనము చెప్పిన పద్ధతిలో డాక్టర్ ఎప్పుడూ కూడా వైద్యము చేయరు. అలాగున సలహా ఇవ్వగలిగితే మనకు డాక్టర్ తో పనిలేదు. మన రోగము మనమే నయము చేసుకుంటాము కదా. అది మనకు చేతకాలేదు, బాధ ఎక్కువ అయింది కాబట్టే డాక్టర్ దగ్గరికి వచ్చాము అని మనము గుర్తించాలి. ఆయన ఉపదేశము మన హృదయములను మెత్తన చేసి మనలను విత్తుటకు సిద్ధము చేస్తుంది.