దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను (1:20-23).
ఈ విధముగా నివసించినవారు దేవుని చేత ఆశీర్వదించబడటము మనము ఈ వచనములలో/లేఖనములలో చూడగలము. మనము దీవెనల కోసము దేవుని వెనకాల, సేవకుల వెనకాల పడటము కాకుండా ఆయన తన నోటిద్వారా స్వయముగా వాటిమీద పలకటము అనేది జరిగినది. ఆశీర్వాదము ఎలాపొందుకోవాలి అనేదానికి దేవుడు అయిదవ దినమున చేసిన సృష్టి మనకు మాదిరిని చూపిస్తున్నది. అంతేకాకుండా అసలు నిజమైన ఆశీర్వాదము ఏమిటి అనేది కూడా మన కనులకు తెలియజేస్తుంది. ఇందులో ఎక్కడా భూసంబంధమైన, ధనము, హోదాతో కూడిన విలాసజీవితమును గురించిన అంశములు లేవు అనేది మనము గుర్తించాలి. దేవుడు చెప్పిన విధముగా మనము మన జీవితములను మలచుకుంటే చాలు. ఆయన ఆశీర్వదిస్తారు. దాని కోసము మనము రకరకాలుగా అడ్డదారులలో ప్రయత్నము చేసి అబద్ధబోధకుల వలలో చిక్కుకొనకూడదు. నిన్ను ఆశీర్వదించటము దేవునికి చాలా ఇష్టము ఎంతో సంతోషము. అయితే అది ఎలాపడితే అలాకాదు అని గ్రహించు. ఇప్పటినుంచి అయినా జీవితములో మార్పు లేకుండా, లేఖనము అనుసరించకుండా, ఆశీర్వాదముల కోసము దేవుని శోధించటము మానివెయ్యి. నువ్వు గోతిలోనికి నడుస్తూ అనేకులను అందులోనికి లాగవద్దు. ఇప్పటికైనా అసలైన source of ఆశీర్వాదమును గుర్తిద్దాము.
మూడు మరియు నాలుగవ దినములానే దేవుడు అయిదవ దినమున కూడా రెండు పనులను చేయటము జరిగినది. ఒకటి సముద్ర జలములలో జీవము కలిగి చలించువాటిని చేయుట. రెండవది ఆకాశములో ఎగురునట్లు పక్షులను చేయుట. అనుదినము మంచి పనులను చేస్తూ వస్తున్న దేవుడు, దినములు గడిచేకొద్దీ తన పనిని ఇంకా అద్భుతముగా మలచటము అనేది ఇక్కడ మనము గమనించాలి. ఆయన కార్యముల యొక్క standard అనేది దినములు గడిచేకొద్దీ పెరిగిందే తప్ప తరగలేదు. అలాగునే మన జీవితములో కూడా ఆయన చేసే కార్యములు అనుదినము అంతకంతకూ పెరుగుతూ అద్భుతముగా ఉంటాయి. ఇది మనము ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకున్నప్పడు సాధ్యము అవుతుంది. పని జరుగుతూ ఉన్నప్పుడు దానిని మనము చూచినప్పుడు అంత అందముగా సంతృప్తిగా అనిపించదు. ఎలా వస్తుందో అనే భయము మనలను వెంబడిస్తూ ఉంటుంది. కాని పని అయిన తరువాత దాని అసలు సౌందర్యము బయటకు వస్తుంది. అందుకే దేవుడు ప్రతిసారి దినము యొక్క చివరలో అది మంచిది అని చెప్పారు తప్ప ప్రారంభములోనో మధ్యలోనో చెప్పలేదు. మనము కూడా ఆయన పని ముగించేవరకు ఓపికగా ఎదురుచూడాలి. మధ్యలోనే మనము అడ్డుపడితే అది ఎందుకు పనికిరాకుండా పోతుంది. సృష్టిలో ఆయన పనితనము చూసి ఆయనమీద విశ్వాసము ఉంచి ఊరక నిలుచుండి చూస్తూ ఆయన ఇచ్చు రక్షణ అనుభవించుము.
రెండవ దినమున చేసిన ఆకాశము, దానిక్రింద ఉన్న జలములను నింపటము అనేది అయిదవ దినమున దేవుడు చేసిన ప్రాముఖ్యమైన పనిగా ఈ వచనములను బట్టి మనకు అర్థము అవుతుంది. రాత్రిపూట ఆకాశమును అలంకరించిన దేవుడు పగటి సమయమున పక్షులను ఏర్పాటు చేశారు. సముద్రములకు జలచరములను ఏర్పాటు చేశారు. దీనినిబట్టి ఆయన చేసినది ఏదీ కూడా నింపకుండా వెలితిగా విడిచిపెట్టరు, దానిని అందముగా తీర్చిదిద్దకుండా ఉండరు అనే విషయము సృష్టముగా అర్థము అవుతుంది. సమస్తము ఒకే దినమున జరగలేదు కానీ సృష్టించుటకు, నింపుటకు మధ్యన కొన్నిదినముల వ్యవధి వచ్చినది అని మనము గ్రహించాలి. ఈ వ్యవధిలో దేవుడు విశ్రాంతి తీసుకోకుండా తాను చేయబోవుతున్న జీవరాశులకు ఆహారమును, పోషణను సృష్టించడము జరిగినది. దేని శరీరమునకు ఏ ఆహారము నప్పుతుందో అన్ని రకములను ఆయన శ్రద్ధగా సృజించారు. నింపి వదిలిపెట్టటము కాకుండా ఆ నింపుదల కొనసాగింపునకు అవసరమైన పరిస్థితులను ఆయన సృష్టించటము జరిగినది. ఇది మనకు చాలా సంతోషము కలిగించు వర్తమానము మరియు ఆయన లక్షణమై ఉన్నది. దేవుడు నన్ను సృష్టించి ఏమీలేకుండా వదిలివేశారు అనే అపోహలు, అపార్థాలు తొలగించుకొనుము. దాని దినమున, సమయమున అది నీ దగ్గరకు తేబడుతుంది, కొనసాగించబడుతుంది అని నమ్ము. త్వరపడి ఆయన గురించి చెడుగా అనుకొనవద్దు. ఆయన నీకోసమే విశ్రాంతి లేకుండా, కునకకుండా పనిచేస్తున్నాడు అని గుర్తించు.