భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను (1:2).
మన జీవితములో అంధకారము అనేది దేవుని ద్వారా సంభవిస్తుంది లేదా ఆయన తోడుగా ఉంటే ఇది ఎందుకు నా జీవితంలో వస్తుంది అనే దురభిప్రాయములు మనము మానుకోవాలి. ఈ వచనము జాగ్రత్తగా గమనించినప్పుడు అంధకారము ఆయన సృజించలేదు అని మనకు అర్థం అవుతుంది. వేడి లేనిచోట ఎలా అయితే చల్లదనము ఉంటుందో, సేద్యము చేయని భూమిలో ఎలా అయితే ముండ్లతుప్పలు పెరుగుతాయో అలానే వెలుగు లేనిచోట చీకటి ఆవరిస్తుంది. మనము మన జీవితములో దేవుని ప్రమేయము, సూచనలు, సలహాలు లేకుండా చేసే అనేక నిర్ణయములు ఇలాంటి పరిస్థితులకు దారితీస్తాయి. మన అనుభవము నుంచి నేర్చుకున్నదే సత్యము అని భావించి దేవుని వాక్యములో ఉన్న సత్యమును అవలంభించకపోయినా కూడా ఈ చీకటి మన జీవితంలో ప్రవేశిస్తుంది. దేవుడు తన సృష్టి క్రమములో అంతా మంచే చేశారు తప్ప ఎక్కడా చెడు లేదా కీడు అనేది చేయలేదు అనే విషయము మనము మర్చిపోకూడదు. నోవహు జలప్రళయము తరువాత భూమిమీద సాధారణ పరిస్థితులు నెలకొనటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే పనిచేశారో అలానే పాపము, తిరుగుబాటు అనే చీకటివలన నిరాకారముగాను, శూన్యముగాను మారిన నీ జీవితమును కూడా ఆయన అందముగా రూపించగలరు. మనము ఆయనకు మొరపెడితే చాలు. ఏ విధమైన వెల, పెట్టుబడి చెల్లించవలసిన అవసరము లేదు. ఈ విషయములను కీర్తనలు 107:10 నుంచి ఉన్న వచనములు మనకు దృవీకరిస్తున్నాయి
ఇక్కడ సమస్తమును కూడా అంధకారములో మునిగి ఉన్నది. అది ఉన్న పరిస్థితి వెలుగు ద్వారా మనకు చూపించలేదు. తన పని మొదలు పెట్టిన తరువాత మాత్రమే వెలుగు ద్వారా దానిని చూపించడము జరిగినది. దేవుడు మన పరిస్థితిని చూసి ఆనందించి హర్షించే దేవుడు కాదు. మనము ఆ పరిస్థితుల్లో ఎక్కువకాలం గడపకూడదు అని మనలను త్వరగా బయటకు తీసుకురావడానికి ఆయన అక్కడ అల్లాడడము, పరలోకమునుండి దిగివచ్చి మనతో ప్రక్కన నిలుచున్న పరిస్థితి గమనించినప్పుడు ఆయన హృదయము స్పందన, వేదన, ప్రేమ ఎలాంటిది అని మనకు అర్థంఅవుతుంది. ఆయన చేసిన ప్రతి కార్యములోను అంతులేని నిస్వార్ధ ప్రేమ కొట్టోచ్చినట్లుగా కనబడుతుంది. ఆ అంధకార పరిస్థితి, నిరాకారము వెలుగు ద్వారా కనిపించేలా చేసి మనము సిగ్గుపడవలసిన పరిస్థితి కలగకుండా చేసిన దేవుని ఆదరణ ఎంతైనా నమ్మదగినది, కోరదగినది. ఆయన కార్యము మొదలుపెట్టినప్పుడు మనయొక్క అందమును, గొప్పతనమును అందరికీ కనిపించేలా చేయడము చూస్తే ఆయన హృదయములో కలిగి ఉన్న ప్రేమ మనకు అర్థమవుతుంది. మన కష్టములో ఆయన రెక్కలక్రింద భద్రపరిచిన దేవుడు, పరిపూర్ణతలో ఫోకస్ మనమీద పడేలా చేసి ఆనందించే సరైన తండ్రి మనస్సు మనకు ఈ జీవితకాలమంతా ఎంతైనా ఆవశ్యకము
ఈలాగున మన జీవితమును చక్కదిద్ది, అంధకారములో మనకు తోడుగా ఉండే దేవుని తెలుసుకోవడము, ఆయనను కలిగి ఉండడము నిజముగా ఎంతో ఆశీర్వాదము. అది వెండి, బంగారముల కన్న కోరదగినది. ఆయన సన్నిధికి ఎప్పుడూ దూరముగా జరగవద్దు. ఆయన సూచనలు, సలహాలు లేకుండా నీ జీవితము చిక్కులలో పడవేసుకోవద్దు. దేవుని వద్ద ఎప్పటికీ ఆలస్యము అనేది లేదు. ఈరోజే ఆయనతో కలుసుకో. నీ జీవితమును తీర్చిదిద్దుకో. ఆయన ఎవరినీ తోసివేయడు.
ఈ యొక్క పరిస్థితి రక్షణ పొందనటువంటి ఆత్మయొక్క పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తుంది. లోకములో ఉన్న కృత్రిమమును నిజమైన వెలుగు అనే భ్రమలో నివసిస్తూ ఉంటాము. అంధకారముతో కూడా నాశనమునకు వెళుతూ అంధకారములో మునిగి ఉన్నప్పుడు మనము ఆయనను వెలుగు కోసము, రక్షణ కోసము అడగలేదు. కానీ దేవుడే మొదటి అడుగు వేసి పరలోకమునుండి దిగివచ్చి మనకు వెలుగు, రక్షణ దయచేయటము జరిగినది