మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. (1:6-8).
రెండవ దినమున దేవుడు చేసిన సృష్టిలో భాగముగా ఆకాశము చేయబడినది. అది తయారుచేయబడిన విధము చూడగా మొదటి దినమున భూమిని కప్పిన ఆగాధ జలముల మధ్య విభజన జరిగి విశాలము కలిగినట్లు మనకు అర్థము అవుతుంది. దేవుడు ఆ జలముల మధ్యన చేసిన విశాలము చాలా ఎత్తుగా చేయుట, అది సులభంగా చేరుకోవాలన్నాకానీ సాధ్యము కాని విధముగా దూరములో ఉంచటము జరిగినది. దానికి ఆకాశము అని దేవుడు నామకరణము చేశారు. ఆ విశాలమును ఆయన తరువాత నాలుగవ దినమున అందముగా అలంకరించినట్లు మనము లేఖనములో చూడగలము. ఆ విశాలము అంతా కూడా ఆయన చేతిపని అని లేఖనము సెలవిస్తుంది. ఆయన చేతితో చేసిన ఏ పని అయినా కూడా చాలా అందముగా ఎవరు చూసినా కాని మెచ్చుకోకుండా ఉండలేని విధముగా తయారుచేయడము జరిగినది. అలాగే ఆయన చేతికి అప్పగింపబడిన జీవితములు కూడా ఉంటాయి.
పరిశుద్ధ గ్రంథమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథములో జలములు అనేవి ఆయా భాషలు మాటలాడు ప్రజలకు సూచనగా ఉన్నాయి. మొదటి దినమున వెలుగునిచ్చి అంధకారము నుంచి విడిపించిన దేవుడు లోకములో ఉన్న మిగతా జనములకు భిన్నముగా మనము ఉండాలి అని మనలను పేరుపరచడము గమనించగలము. పరిశుద్ధ గ్రంథము మొత్తం మనము పరిశీలన చేసినప్పుడు ఆయన తనవారిని లోకమునుండి ప్రత్యేకపరచినట్లు మనకు అర్థము అవుతుంది. అలానే ఇక్కడ కూడా దేవుడు రక్షణ ద్వారా వెలిగించబడిన వారిని మారుమనస్సు అనే ప్రక్రియ ద్వారా వేరుపరచటము మనము గమనించగలము. ఈ క్రియను అనుసరించి మనము దేవుని తెలుసుకున్న తరువాత లోకము యొక్క పోకడలకు, విధి విధానాలకు మనల్ని మనము వేరుచేసుకోవాలి. ఆలాగున వేరుగా ఉండటము ఆయన అభిష్టము అని మనకు 6వ వచనము ద్వారా అర్థము ఆవువతుంది. ఆయన చిత్తము ఏమై ఉన్నదో అదే కలుగును గాక అని ఆయన నోటిద్వారా పలకటము మనకు లేఖనములలో ప్రస్ఫుటముగా దర్శనమిస్తుంది. ఈ యొక్క వచనమును అనుసరించి లోకమునకు మనము దూరముగా ఉండాలి తప్ప, లోకములో ఉన్న వ్యక్తులను ద్వేషింపకూడదు. మనము వారిని ప్రేమించాలి. అయితే వారి ఆలోచనలను, పద్ధతులను, ఆచారములను మాత్రమే సమ్మతించకుండా దూరముగా, వేరుగా ఉండాలి.
జలముల మధ్య విశాలము కలిగించిన దేవుడు ఎప్పుడూ కూడా రాజీపడడు అని మనకు అర్థము ఆవుతుంది. అందుకే ఎక్కడా కూడా జనములను కలిపి ఉంచకుండా మొదటి దినము నుంచి చివరి వరకు వెలుగు సంబందులకు, చీకటి సంబందులకు మధ్య ఆయన ఎడబాటు అనేది లేదా విభజన అనేది ఉంచటము జరిగినది. భక్తి భక్తే మిగిలిన జీవితము లోకములో అందరిలాగే జీవించవచ్చు అనే అభిప్రాయము ఈ రోజున లోకములో చాలామందికి ఉంది. కానీ అది సరైన అభిప్రాయము కాదు అని దేవుడు వారి మధ్య ఏర్పచిన విశాలము మనకు స్పష్టము చేస్తుంది. ఆయన దాని గురించి లేఖనములో మాట్లాడినప్పుడు మనపట్ల ఆయనకు ఉన్న ఆలోచనలు, తలంపులు ఎంత ఉన్నతముగా ఉన్నాయో తెలియజేయటానికి ఆయన ఆ విశాలము అంత ఎత్తుగా ఉంచటము జరిగినది. కానీ దేవుని పట్ల మన ఆలోచనలు గమనించినప్పుడు అవి అలా ఉన్నతముగా కాకుండా ఆయనను జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలా అని చూసే సంకుచితమైనవిగా ఉన్నాయి. అనుదినము ఆకాశమును మనము చూడటము ద్వారా ఆయన ప్రేమ, ఉన్నతమైన ప్రణాళికలు మనకు గుర్తుచేస్తున్నాయి. వాటిని మనము అందుకోవాలి అని ఆయన తాపత్రయపడుతున్నాడు. అవి మన జీవితములో నెరవేరినప్పుడు ఆయన చాలా ఆనందిస్తాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని మనస్సు నూతనపరుచుకుని ఉన్నతముగా ఆలోచిద్దాము.