దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను (1:11-13).
మనుష్యుల యొక్క పాపము ద్వారా భూమి దాని సారము కోల్పోయి శాపమునకు గురి అయి చీడ పీడలను, తెగుళ్లను సంతరించుకున్నప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా శాపవిమోచన కలిగించి సమస్త సృష్టిని కూడా స్వస్థపరచినందుకు ఆయనకు లెక్కలేని/ఎనలేని కృతజ్ఞతా స్తుతులు. ఈరోజున మనము పంటల విషయములోను, వృక్షముల విషయములోను ఎదుర్కొంటున్న తెగుల్లు అన్నీ మన పాపముల ఫలితమే అని, నిరపరాధుల రక్తమును, ఆయన భక్తుల యొక్క రక్తము ఒలికించుట వలననే అని గుర్తుంచుకోవాలి. అయితే ఆయనను మనము పాపము ద్వారా ఎంత విసిగించి శోధించినా కూడా ఆహారము పండకుండా చేయని దేవునికి కృతజ్ఞతలు. మనము ఆయన ప్రేమను, మనస్సును అర్థము చేసుకుని బ్రతకాలి. ఆ యా తెగుళ్ళను సమర్ధవంతముగా ఎదుర్కోవటానికి మందులు తయారుచేయటానికి మనిషికి జ్ఞానము దయచేసిన దేవునికి వందనములు. ఆ మందులు తయారుచేయడానికి అవసరమైన ప్రతి ముడిపదార్థము ఆయన ద్వారా మనకు దయచేయబడినదే. మన స్వంతముగా వాటిని తయారుచేయలేదు. భూమియు, దాని సమస్త సంపూర్ణతయు దేవునివే అని మనము గ్రహించి నడుచుకొనిన యెడల ఆయన భూమిని మరల పాలు తేనెలు ప్రవహించున్నట్లుగా చేయగలరు. మన పాపమే మనము ఎదుర్కొనే ప్రతి ఇబ్బందికి మూలము
వృక్షములు అనేవి సమస్త జీవరాసులకు కూడా shelter అనేది ఇవ్వటము మనము ప్రకృతిలో గమనించగలము. చెట్లయొక్క కొమ్మలమీద పక్షులు గూడు కట్టుకుని నివాసము చేస్తూ తమ గుడ్లను పొదుగుతాయి. కొన్ని అడవి జంతువులు వాటిమీద నివాసము చేస్తాయి. క్రూరమృగములు సహితము వాటి నీడన విశ్రమిస్తాయి. అలానే మానవునికి కూడా దేవుడు మొదటిగా చెట్లమధ్య నివాసము ఏర్పాటు చేసినట్లు చూడగలము. దీని ద్వారా ఒక విషయము మనకు సృష్టముగా అర్థము అవుతుంది. మనము ఎదిగిన తర్వాత ఇతరులకు మనము ఆశీర్వాద కారణముగా ఉండాలి. దుర్మార్గులు సహితము మన చెంతకు చేరినప్పుడు వారి ప్రాణములకు నెమ్మది కలిగించి వారిని ఆదరించే విధముగా మనలోని ఆత్మ ఫలములు ఉపయోగపడాలి. బాటసారులు ఒక చోటనుండి మరొక చోటికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు దారి పొడుగున ఉన్న వృక్షములు వారి ప్రాణములకు సేద తీర్చినట్లు, లోకములో ప్రయాణము చేస్తూ అలసిపోతున్న వారి ప్రాణములకు మనము సేద తీర్చాలి. అందుకోసమే దేవుడు మనకు ఆత్మ వరములను, ఫలములను దయచేశారు తప్ప మనలను మనము గొప్ప చేసుకోవటానికి మాత్రము కాదు. ఎదిగేకొద్దీ దేవుని యొక్క ప్రేమ, జాలి, దయ, కరుణ, ఆదరణ ఎలా ఉంటాయి అనేది లోకమునకు కనపరిచి, అలసిపోయిన వారి ప్రాణములకు విశ్రాంతి దొరికే మార్గము దేవుడే అని చూపించాలి. ఆ విధముగా మనలో ప్రతి ఒక్కరినీ దేవుడు తీర్చిదిద్దును గాక ఆమెన్.
ఏదిగి ఫలించిన వృక్షములు నీతిమంతులకు సూచనగా ఉన్నాయి. ఉప్పెన అనేది వచ్చినప్పుడు దానిని నియంత్రించటంలో వృక్షములు ఎలా అయితే సహాయము చేస్తాయో, నీతిమంతులు కూడా దేవుని యొక్క ఉగ్రత భూమిమీదకు వారి వారి పట్టణముల మీదకు రాకుండా నిలువరిస్తారు. అలాంటి నీతిమంతులు 10 మంది లేకపోవుట వలన సొదొమ గొమెర్ర పట్టణములు నాశనమునకు గురి అయ్యాయి అని మనకందరికీ తెలిసిన విషయమే. చెట్లులేని ప్రాంతము ఎలా అయితే వర్షము కురియక ఎండిపోతోందో, కరువు ప్రాంతముగా మారిపోతుందో అలానే జనులు ఎదిగి ఫలించని చోట పరిస్థితులు అలానే ఉంటాయి అని మర్చిపోకూడదు. వృక్షములు ఉన్నచోట భూమి వర్షము కలిగి పచ్చగా ఉన్నట్లు నీతిమంతులు ఉండుట ఆ పట్టణమునకు శ్రేయస్కరము, ఆశీర్వాదము. భూమి మీద నీతిమంతులు విస్తరించాలి అనేది దేవుని చిత్తము అని పరిశుద్ధ గ్రంధము లేఖనములు కూడా సెలవిస్తున్నాయి. దేవుడు మనలను నియమించిన చోట మనము దీవెనకరముగా ఉంటున్నామో, లేక శాపకారణముగా ఉంటున్నామో అనేది మన ఫలింపుమీద ఆధారపడి ఉంటుంది అని దీనిని బట్టి మనకు స్పష్టముగా అర్థము అవుతుంది. మరి నీవు ఎలా ఉన్నావు అనేది సరిచూసుకొని నీ ప్రవర్తన సరిదిద్దుకో. నీ కుటుంబముతో పాటు, నీ ఊరిని కూడా రక్షించుకో.