దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (1:5).
ప్రతిదానికి పేరు పెట్టటము అనే పద్ధతి దేవుడి దగ్గరనుంచి మనము నేర్చుకున్నాము. ఈ క్రమమును దేవుడు ఆదామునకు అప్పగించగా ఆదామునుండి మనకు సంక్రమించినది. ఆయన మంచిదానికి, మంచిది అని చెడ్డదానికి కూడా పేరు పెట్టటము మనము గమనించగలము. అనగా ప్రతిదానికి ఆయన ఒక ఉనికి, గుర్తింపు అనేది ఇస్తారు. వాటియొక్క స్వభావము, క్రియలను బట్టి వాటి గమ్యము నిర్దేశిస్తారు తప్ప పేరు ఉన్నంత మాత్రమున అవి గొప్పవి కావు. పౌలు అని, పేతురు అని, యోహాను అని పేరు పెట్టుకున్నంత మాత్రమున మనము అపోస్తులులము కాలేము గాని వారి జీవనశైలిని అనుసరించి జీవించినపుడే అపోస్తులులుగా గుర్తించబడతాము. శిష్యులు అనే నామము మనకు పెట్టబడుతుంది. చీకటికి కూడా దేవుడు పేరు పెట్టారు కాబట్టి అది గొప్పది అనే భ్రమలో మనము ఉండకూడదు. ఇక్కడ చీకటికి కూడా పేరు పెట్టడానికి రెండు కారణాలు ఉండవచ్చు. మొదటిది ఆలాగున ఉండకూడదు అని హెచ్చరించటానికి. రెండు మనము పాపబంధకములలో ఆ చీకటిలో మగ్గిపోతున్నాము కాబట్టి మన దగ్గరకు తన కుమారుని/వెలుగును పంపటానికి, మన నిమిత్తము పేరు పెట్టి ఉండవచ్చు. లేకపోతే చీకటిని గుర్తించవలసిన అవసరం దేవునికి లేదు.
ఈ వచనములో మన అందరికి సంతోషకరమైన వర్తమానము కలదు. దేవుడు సృష్టించబడిన ప్రతిదానికి గుర్తింపు ఇస్తారు అని. ఆయన దృష్టినుండి కనుమరుగు అయ్యి ఏదీకూడా ఉండలేదు. పేరును బట్టి నేను ఎరుగుదును. పేరుతో నిన్ను పిలిచియున్నాను అని ఆయన పలికిన మాటలే అందుకు నిదర్శనము. నీవు చిన్నవాడను, ఎవరికీ పట్టను, పనికిరాను అని ఎన్ని అనుకున్న నీవు దేవుని చేత ఎరుగబడినవాడవు. నీ గురించిన గుర్తింపు ఆయన దగ్గర ఉన్నది. ఆ మహామహుని దగ్గర నీ గురించిన సమాచారము, నీ గురించిన శ్రద్ధ ఉన్నాయి. అందుకే నీకోసము భూమిమీద స్థలము, నీవు జీవించు సంవత్సరములకు సరిపడా వనరులు, నీకు తోడుగా ఒక దూతను ఉంచటము జరిగినది. మనుషుల గుర్తింపు కన్నాఆయన గుర్తింపు ఎంతో విలువైనది. ఆయన అందరికన్నా గొప్పవాడు అనే విషయము మర్చిపోకూడదు. నీవు వృధా కాదు. కేవలము దారితప్పినవాడవు మాత్రమే. అనామకుడవు కాదు ఉపయోగించబడని ఆయుధానివి, అనాధవు కాదు సృష్టికర్త, మహా ధనవంతుడైన చక్రవర్తి కుమారుడవు. బీదవాడివి కాదు సంపద గురించి మూలపాఠములు నేర్చుకుంటున్న విద్యార్థివి. బాధింపబడిన వానివి కాదు క్రమశిక్షణలో పెరుగుతున్న మాదిరివి. విలువలేని వాడవు కాదు రక్తమంతా ధారపోసి సంపాదించుకోగలిగిన అమూల్య రత్నానివి. ఆయన ఇచ్చిన గుర్తింపును గ్రహించలేక మనము చేసిన క్రియలు మనలను చీకటిగా మార్చివేశాయి తప్ప ఆయన ఎప్పుడూ నీకు గౌరవనీయమైన సముచిత స్థానమే ఇచ్చాడు.
కేవలము పేరు మాత్రమే పెట్టి వాటిని విడిచిపెట్టకుండా అవి ఎందునిమిత్తము ఉపయోగపడాలి, అవి చేయబడిన ఉద్దేశ్యములు, వాటిచుట్టూ ఒక ప్రపంచము నిర్మించటము జరిగినది. అలానే పేరుపెట్టబడిన మనకుకూడా ఆయన ఒక ప్రణాళిక రచించియున్నారు. ఇది మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకముగా ఉంటుంది అని గుర్తించాలి. మనకు అప్పగింపబడిన బాధ్యతలను గుర్తెరిగి వాటిని మనము నెరవేర్చాలి. ఏదైనా ఒక వస్తువు ఒక ఉద్దేశ్యమును మనసులో ఉంచుకొని తయారుచేసినపుడు దానిని మరొక ఉద్దేశము కొరకు ఉపయోగించటము అంత తేలికైన పనికాదు. అది నిరుపయోగము అనే బోర్డుక్రింద తుప్పు పట్టవలసి ఉంటుంది. లోకములో జనాభా సంఖ్యలోనికి నీవు వచ్చిఉన్నావు అంటే నీకు గుర్తింపు, ఉద్దేశము already రచించబడ్డాయి అని అర్థము. నీవు విధేయత అనేది చూపించి ఆ ప్రణాళిక, ఉద్దేశ్యమును నెరవేర్చుటకు ఉపయోగపడకుండా ఉండుటవలన పక్కన విడిచిపెట్టబడ్డావేమో ఆలోచించు. ఉద్దేశ్యమును నెరవేర్చే వస్తువు యొక్క పేరు గొప్ప చేయబడుతుంది. ఘనత పొందుతుంది. మరి పేరు పెట్టబడిన నీవు నీ ప్రణాళికలోనూ ఉద్దేశములోనూ ఎక్కడ ఉన్నావో గుర్తించు. ఘనత, ఘనహీనత, తల లేక తోక అనేది నీ చేతిలోనే ఉన్నది అని గుర్తించు. ఆయన నీ ఘనతకు సమస్తమును ముందుగానే సిద్ధపరిచి అందుబాటులో ఉంచారు. పేరు, గుర్తింపు అనేది సరదా కోసము కాదు అవి బాధ్యతలు.