దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. (1:11-13).
చెట్టు యొక్క ఫలములను బట్టి దాని స్వభావము అంచనా వేయవచ్చు అని లేఖనము మనకు తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తువారు సెలవిచ్చిన రీతిగా మంచిచెట్టు కాని ఫలములు ఫలింపదు, కానిచెట్టు మంచి ఫలములు ఫలింపదు. మన యొక్క ఫలములను బట్టి మనము దేవుని వాక్యమును అనుసరించి ఎదుగుతున్నామో, లేక లోకమును, స్వంత జ్ఞానమును అనుసరించి ఎదుగుతున్నమో అనేది అర్థము అవుతుంది. అనుదినము మనలను మనము వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకుంటూ ప్రతి చిన్న తప్పిదమును సరిచేసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడే తప్పు విషయములో జాగ్రత్త పడకపోతే అది పెరిగి పెద్దది అయి మన హృదయము బండబారేలా చేస్తుంది. దేవుడు ఎప్పుడు ఎవరి విషయములోనూ చెడ్డ విత్తనము వేసినట్లుగా మనకు కనిపించదు. అందుకే మన ఫలములు సరిగా లేకపోతే మనమే దేవునికి అంటుకట్టబడకుండా తప్పిపోయి లోకమునకు అంటుకట్టబడ్డాము అని గుర్తించాలి. దానిద్వారా శరీర లక్షణములు మనలో ప్రవేశించి ఆత్మఫలములను పాడుచేస్తాయి. అప్పుడు మనము కారుద్రాక్షలు లేదా కానిఫలములు ఫలిస్తాము. దానివలన దేవుని ఉగ్రతకు మనము గురి అవుతాము అని లేఖనము హెచ్చరిస్తుంది. ఈరోజునే నీ ఫలములు ఎలా ఉన్నాయో చూసుకుని నీ ప్రవర్తన విషయములో జాగ్రత్తపడు. నాశనము నుండి తప్పించుకో.
ప్రతి చెట్టు కూడా తన జాతిని అనుసరించి తనలో విత్తనము కలిగి ఉన్నది అని ఈ వచనము మనకు తెలియజేస్తుంది. దీని అర్థము ఒకటే. ఇక్కడ సమాజములో ఉండేటటువంటి జాతులు లేదా కులములు గురించి దేవుడు మాట్లాడటము లేదు. అవి మనుషుల ద్వారా పాపము ద్వారా లోకములో ప్రవేశించాయి తప్ప దేవుని ద్వారా కలుగలేదు అని మనము గుర్తించాలి. ఇక్కడ జాతి అనేది దేవుడు మనకు లోకములో ఏర్పాటు చేసిన పిలుపు, మన హృదయ స్థితి అయి ఉన్నది. మనలో ఉన్న విత్తనము/ఫలములను బట్టే మన వారసులు, సంతానము తయారవుతారు అని దాని అర్థము. మనము గనుక మంచి ఫలములను కలిగివుంటే దేవుని యొక్క విత్తనము మనలో చెడిపోలేదు కాబట్టి ఆశీర్వచనము అనుసరించి, మన సంతానము కూడా దేవునిలో ఎదుగుతూ లోకమునకు వెలుగుగాను, దీవెనగాను ఉంటారు. ఒకవేళ మన ఫలములు సరిగా లేకుండా, దేవుడు వేసిన విత్తనము మనము పాడుచేసుకుంటే మన సంతానము కూడా దేవునికి దూరస్తులై శాపమునకు ఆస్పదముగాను, లోకములో దేవుని మార్గములు చెదరగొట్టటానికి సాతాను చేతిలో ఉపయోగపడు సాధనములుగాను, దేవుని ఉగ్రతకు గురి అవుతారు. మనము సరిగా లేకపోతే మన సంతానము కూడా సరిగా ఉండదు అని గ్రహించాలి. నీవు దేవుని ప్రణాళిక కట్టువాడవుగా ఉన్నావా? లేక చెదరగొట్టే వాడవుగా ఉన్నావా?
ఆలాగుననే వాటిలో కొన్ని విత్తనములు ఇచ్చే చెట్టుగా ఉండాలి అని ఈ వచనములో వ్రాయబడిన ప్రకారము సమాజములో దేవుడు ఆశించిన విధముగా జనులు తయారు అవ్వాలి అని ఆయన నిర్దేశించిన సేవకులకు అవి సాదృశ్యముగా ఉన్నాయి. మనము మనకు ఉన్న పిలుపును బట్టి ఆ యా రకమైన విత్తనములను దేవుని చిత్తానుసారము ప్రజల జీవితములో వేసి వారు ఫలించటానికి, ఆలాగుననే మరికొంతమంది తమ కుటుంబముల ద్వారా లోకములో తయారుచేసి దేవుని యొక్క రాజ్యము స్థాపించాలి అనేది దేవుని చిత్తము. అలానే ఆ యా సేవకులు తమలాంటి సేవకులను కూడా తయారుచేయాలి. అన్ని వృక్షములు ఎలాగైతే ఐక్యత కలిగి ఉన్నాయో, అలానే సేవకులు కూడా దేవుడు వారికి నియమించిన పిలుపును బట్టి మిగతావారికి సహకరిస్తూ వారి వారి విధులను నిర్వర్తించాలి. మనము వేరొక చెట్టు యొక్క విత్తనము బాగుంది అని కాని, దానికి మరింత ఘనత ఉన్నది అని కాని వేరే వాటిని తయారుచేయటానికి పూనుకోకూడదు. దేవుడు మనకు నియమించిన పరిధిలోనే మనము పని చేయాలి. ఇక్కడ కూడా సేవకులు తమ విత్తనములు పాడు చేసుకోకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే దొంగ సేవకులు ఎక్కువ తయారయ్యే ప్రమాదము కలదు. దేవుడు మనకు నియమించిన పనిలో నమ్మకముగా ఉందాము. భళా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత అనిపించుకుందాము