మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను (1:6-8).
మనము భూమిమీద నివసిస్తున్నా కానీ భూసంబందులుగా కాకుండా, పరలోక సంబంధులుగా ఉండాలి అనేది దేవుని చిత్తము అని మనకు ఈ వాక్యముల ద్వారా తెలుస్తుంది. ఈ భూమిమీద కన్నా ఆకాశములోనే వెలుగు యొక్క అద్భుత ఆశ్చర్యకార్యములను దేవుని యొక్క నైపుణ్యతను మనము కనుగొనగలము. అలానే ఈ లోకములో మనము చూసేటటువంటి దేవుని మంచితనము కొసమెరుపు మాత్రమే. ఆయన సంపూర్ణతలోనికి మనము నడిచి పరలోకమునకు, మనకు మధ్య ఉన్న లోటును చెరపగలిగినప్పుడు ఆయన అద్భుతకార్యములను, మహిమను మనము చూడగలము. మనము ఆయనకు ఆవిధేయులమై చిత్తమును వెంబడించకపోతే నష్టపోయేది మనమే. పరలోకమును miss అవ్వడం కన్నా పేదరికము ఈ లోకములో మరొకటి లేదు. ఆయన ప్రేమ, కరుణ రుచి చూడలేకపోవటము మించిన కష్టము లేదు. ఆయన చిత్తప్రకారము ఎలాగైతే సమస్తమును జరిగినవో, మనము ఆయనకు విధేయత చూపించాలి అని సంపూర్ణముగా పూర్ణ హృదయముతో నిర్ణయము తీసుకుంటే, ఆయన వాక్యము ఆ ప్రకారమాయెను అనేటటువంటి మాటను అనుసరించి సమస్తము మన జీవితములో నెరవేరుస్తుంది. ఆయన మాట ప్రకారము కాకుండా చెప్పినది తప్పిపోవటము అనేది పరిశుద్ధ గ్రంథములో మనకు ఎక్కడా కూడా కనిపించదు. అలానే నీ జీవితంలో కూడా అది కాకుండా పోదు.
జలముల మధ్య గొప్ప విశాలత కలుగచేసిన దేవుడు ఆకాశములో తన నివాసస్థలము ఏర్పాటు చేసుకోవటము మనము గమనించగలము. దీనికి గల కారణము మనకు దూరంగా ఉండాలి అనో మనము అంటరాని వారము అనో లేక ఆయన దర్పము చూపించుకోవాలి అనో కాదు. దీనికి ప్రాథమికముగా రెండు కారణములు మనము చెప్పుకోవచ్చు. మొదటిది పైన ఉన్న వ్యక్తికి క్రింద ఏమి జరుగుతున్నది అనే విషయము చాలా స్పష్టముగా కనిపిస్తుంది. మనము నడిచే త్రోవ ఎక్కడకు మనలను తీసుకువెళ్తుంది, ఆ మార్గములో ఉపద్రవాలు, నష్టములు ఏమిటి అనేది సృష్టముగా కనిపిస్తాయి. మనలను అందరినీ కూడా చూడడానికి వీలవుతుంది. అందుకనే పర్యవేక్షణ దృష్టితో మనము వేసే ప్రతి అడుగు కూడా గమనిస్తూ మనలను guide చేయడానికి ఆయన అక్కడ ఉన్నారు. రెండవదిగా ఈ భూమి శాశ్వతమైనది కాదు కాబట్టి మన జీవితకాలము దీనిమీద ఆవిరి వంటిది కాబట్టి, మనలను శాశ్వతకాలము తనతో ఉంచుకోవటనికి శాశ్వతకాలము నిలిచి ఉండే పరలోకములో భవనములు/ స్థలమును మనకొరకు సిద్ధము చేయించటానికి ఆయన అక్కడ ఉన్నారు. మనము శాశ్వతముగా భూమిమీద ఉంటే ఆయన నివాసము కూడా భూమిమీదే ఉండేది. ఆయన చేసే ప్రతి పని వెనుక హృదయములో మనము ఉంటాము అనేది మర్చిపోకూడదు. మరి నువ్వు చేసే ప్రతి పనిలో నీ హృదయములో ఆయన ఉన్నాడా???
ఆయన నివాసస్థలము ఆయన ఆకాశమును మనము గమనించినప్పుడు ఆయన స్వభావము, లక్షణములు ఎలాంటివి అనేది మనకు అర్థము అవుతుంది. మన అభిరుచికి తగినట్లుగానే మనము మన ఇంటిని అలంకరిస్తాము. నచ్చిన రంగులు వేస్తాము. ఆకాశము యొక్క రంగులను మనము గమనించినప్పుడు అవి ఎక్కడా మనలను భయపెట్టే విధముగా ఉండకపోవటము మనము గమనించగలము. అర్ధరాత్రి సమయములో చూసినా ఏ మాత్రము భయము కలిగించవు. కేవలము పాపముతో నిండి ఉన్నవారికి, తీర్పును అనుభవించబోతున్న వారికే ఆ సమయములో ఆకాశము భయంకర రూపము సంతరించుకుంటుంది. ఆ తరువాత దినములన్నియు మరలా నిర్మలముగానే ఉంటుంది. దీనినిబట్టి ఆయన కోపము క్షణకాలము ఉండి, ఆయన కృప ఆయుష్కాలము ఉంటుంది అని మనకు అర్థము అవుతుంది. ఆయన నివాసస్థలము పరిశుద్ధమైనది భూమిమీద మాలిన్యము, pollution ఉంటాయేమో కానీ పరలోకములో అవి మచ్చునకు కూడా కానరావు. ఏ విధమైన sound pollution ఉండదు. ఆకాశములు సృష్టించకముందే ఆయన ఉన్నాడు కాబట్టి ఇవి ఏవీకూడా ఆయన కోసము కాదు మనకోసమే అని మనము గ్రహించాలి. అక్కడ మన శరీరము కూడా మహిమకరముగా ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. everything is marvellously planned by GOD for us.