దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. (1:11-13).
ఐక్యత, విధేయత, దాసుని స్వభావము గురించి వృక్షములు మనకు అనేక పాటములను నేర్పిస్తుంటాయి. ఒకేతోటలో మనము వేసే విత్తనములను బట్టి రకరకాల చెట్లు/వృక్షములు ఎదుగుతూ ఉంటాయి. అవి అన్నీ కలిసికట్టుగా ఉండి తనను పెంచిన ఉద్దేశ్యము చొప్పున తోట యజమానికి సహకారము అందిస్తాయి తప్ప, వాటి ఆధిపత్యము కోసము అని గానీ, అవి మాత్రమే ఉండాలి ఎదగాలి, మిగతా వృక్షములు ఉండటానికి వీలులేదు అని వాటిని అణిచివేయవు. ఏ వృక్షముకూడా దేవుడు తమకు నియమించిన విధిని ఇంతవరకు మీరలేదు. మనుష్యులకు చల్లని గాలిని అందిస్తూ, వారి పోషణకు అవసరమైన ఫలములను అందిస్తున్నాయి. పగటివేళ అంతా మనకు ఆక్సిజన్ అందిస్తూ రాత్రివేళ మనము నిద్రించే సమయమునకు మాత్రమే అవి కార్బన్ డయాక్ సైడ్ రిలీజ్ చేస్తాయి. వాటి యజమానుడు పని చేసినంతసేపు అవి కూడా దాసునిలానే పనిచేస్తాయి. గాలిని సరఫరా చేసే విషయములో కలిసికట్టుగా సహకరించుకుంటూ పనిచేస్తాయి తప్ప ఒక చెట్టు ఒక direction లో మరొక చెట్టు మరొక direction లోను గాలిని విసరవు. వాటిలో పనికిరాని, జీవములేని ఆకులను నేలరాల్చి కొత్తగా జీవము కలిగిన వాటిని పుట్టించుకుంటాయి. తమ ఫలముల యొక్క భారమును ఆనందముగా భరిస్తాయి. రాళ్లదెబ్బలు తట్టుకుంటాయి. ఆఖరికి నరికివేయబడినా కూడా తమ యజమానికి ఉపయోగపడతాయి. ఈ లక్షణాలు అన్నీ మనకు ఏదో పాఠములను నేర్పిస్తున్నుట్లుగా లేవు? అంతేకాక సవాళ్ళను కూడా విసురుతున్నాయి.
చెట్టు ఎదగటానికి దానియొక్క వేరు లోతునకు వ్యాపించటము చాలా అవసరము అని మనకందరికీ తెలిసిన విషయమే. లోతునకు వేరు వ్యాపించకపోతే చెట్టు పైకి ఎదుగుతూ ఉన్నప్పుడు అది బలముగా నిలబడలేదు. చిన్న గాలి వచ్చినా పడిపోయే ప్రమాదము ఉంది. అలానే ఆత్మీయ జీవితములో మనకు వచ్చే పెనుసవాళ్లను సమర్థవంతముగా ఎదుర్కొని నిలబడాలి అన్నా, పడిపోకుండా ఉండాలి అన్నా వాక్యము మన హృదయములో లోతుగా వేళ్ళూనుకోవటము తప్పనిసరి. ఇక్కడే మనము ప్రభువైన యేసుక్రీస్తువారు చెప్పిన విత్తువాని ఉపమానము జ్ఞాపకము చేసుకోవాలి. అక్కడ ఆయన హెచ్చరించిన విధముగా విత్తనము ఎదగకుండా చేసే పరిస్థితులు మన జీవితములో రాకుండా జాగ్రత్తపడాలి. మన హృదయమును మంచి నేలగా మనము అనుదినము సిద్ధపరచాలి. మనకందరికీ విడుదల అనేది సంతోషము కలిగిస్తుంది తప్ప ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి ఫలించటము ఒకింత ఇబ్బందిగా ఉంటుంది. ప్రభువు ఎలాగైతే మనకోసము సమస్తము సహించుకొన్నారో అలానే మనము కూడా ఆయన నిమిత్తము సమస్త ఇబ్బందులను సహించుకోవాలి. మొదట ఆయన చేసి మనకు మాదిరి చూపాడు అనే విషయము మరిచిపోకూడదు. ఈరోజు మన ఎదుగుదల ఆత్మీయముగా ఎందుకు కుంటుపడిందో గ్రహించి నూరంతలుగా ఫలించటానికి అన్ని విధాలా చర్యలు చేపడదామ.
మనము మన హృదయమును సరిచేసుకుని ఎదిగే విషయములో సంపూర్ణమైన బాధ్యత మనదే అనే విషయము మరిచిపోకూడదు. ఎదుగుదల అనేది మనము దేవునితో అంటుకట్టబడటము వలన మాత్రమే సాధ్యము ఆవుతుంది అని గ్రహించి, దేవుని వాక్యము సహాయముతో మనలను మనము సరిచేసుకుంటూ, తీర్చిదిద్దుకుంటూ లోకము మనలోనికి ప్రవేశించకుండా జాగ్రత్తపడాలి. దేవుని యొక్క వాక్యము మనలో క్రియ చేయకుండా ఉండడానికి మనమే అడ్డుబండగా మారకూడదు. అలాగున జరిగితే మన లోపలి ఫలింపు అనేది ఆగిపోతుంది. ఆలాగు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని లేఖనము మనకు సెలవిస్తుంది. అయితే ఆయనతో మనము అంటుకట్టబడి ఉన్నంతవరకూ మనము ఫలించుటకు తన శాయశక్తులా మనకు సహాయము చేస్తారు. అన్నివిధాలుగా ప్రయత్నము చేస్తారు. తండ్రి యొక్క ఉగ్రత మనమీదకు వచ్చి మనము నరకబడకుండా మనలను తప్పిస్తారు. ఆయన వైపునుంచి ఏ విధమైన లోపమూ లేదు అని పరిశుద్ధ గ్రంథము సృష్టముగా సెలవిస్తుంది. మనము ఎదగకపోయినా, ఫలించకపోయినా పూర్తి బాధ్యత మనదే అని గుర్తించాలి. ఆలాగున ఫలించకుండా చేసుకుని ప్రభువు యొక్క త్యాగము, ప్రయాస వృధా చేయటము మనకు తగదు. అందుకే ఈరోజు నుంచి ఆయన పడుతున్న శ్రమను అర్థము చేసుకొని ఫలిద్దాము