దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను (1:20-23).
ఈ విధముగా నింపుదల చేసిన దేవుడు సముద్ర జలములలో మత్స్యములతో పాటుగా, జీవము కలిగి చలించు మిగతావాటిని కూడా చేయటము జరిగినది. అవి అన్నీ ఒకేచోట కలిసిమెలిసి నివాసము చేయాలి అని ఆయన నిర్దేశించారు. దీనినిబట్టి లోకములో కేవలము నిత్యజీవము కలిగినవారు మాత్రమే కాకుండా మిగిలినవారు కూడా ఉంటారు అని గ్రహించాలి. మనము వారికి వేరుపడి వేరే ప్రదేశములో నివాసము ఉండటము సాధ్యము కాదు అని గ్రహించాలి. మనము వారి క్రియలకు వేరుగా బ్రతకాలి. దేవుడు తన కృపద్వారా వారికి దయచేసిన జీవమును వారు నిత్యజీవముగా మలుచుకోవటములో విఫలము అయ్యారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తువారు యోహాను 17లో ప్రార్థన చేస్తూ వారిని లోకమునుండి తీసుకునిపొమ్మని నేను ప్రార్ధన చేయటము లేదు కానీ, దుష్టునినుండి వారిని కాపాడుము అని అడగటము/తండ్రిని వేడుకొనుటము జరిగినది. దీనినిబట్టి మనము వారికి వేరుగా మరొక ప్రదేశములో నివసించటము సాధ్యము కాదు అని అర్థము అవుతుంది. వారితో ఆలోచనలోనూ, క్రియలలోను, జీవన విధానములోనూ మనము వేరుగా ఉండాలి. దేవుని స్వరూపములోనే చేయబడిన సాటి సహోదరులుగా వారిని గౌరవించి, ప్రేమించాలి. దేవుడు ఇశ్రాయేలీయులను లోకమునుండి వేరుపరిచి విడిగా ఉంచి ఉంటే మనకు రక్షణ ఎలా దొరికేది? అందుకే లోకము యొక్క ఆశను ప్రేమించకు కాని దానిలోని మనుష్యులను ప్రేమించు. నీ ద్వారా మరికొంతమందిని రక్షణలోనికి నడిపించు. వారిని ఎప్పుడూ కూడా ద్వేషించకు.
వాటి వాటి జాతి ప్రకారము అని తెలియచెప్పట ద్వారా కూడా ఇక్కడ దేవుడు జీవపరిణామ సిద్ధాంతమును కొట్టివేయటము జరిగినది. మనము ఎక్కడా doubt అనేది పడకుండా లోకములోని తత్వవేత్తలు మనలను confusion లోనికి నెట్టకుండా జ్ఞానులు అని చెప్పబడిన వారు మనలను విశ్వాసమునుండి తొలగించకుండా దేవుడు సృష్టముగా ఒకదానికన్నా ఎక్కువ రకములను సృష్టించినప్పుడు, ప్రతి దాని విషయములోను ఆయన specific గా దాని దాని జాతి ప్రకారము అనే పదము పదే పదే ఉపయోగించటము జరిగినది. భవిష్యత్తులో సాతాను చేసే కుట్రలకు, మనుష్యులు ఎలా మారతారో ఎరిగిన దేవుడు ముందు జాగ్రత్తగా ఎన్నో వేల సంవత్సరముల క్రితమే ఈ విషయముల గురించి శ్రద్ధ తీసుకోవటము జరిగినది. మన మేలు విషయమై, తొట్రిల్లకుండా ఉండే విషయమై ఆయనకు ఉన్న శ్రద్ధకు ఎంతైనా కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఆయన ఖడ్గమునకు రెండువైపులా పదును ఉన్నట్లు ఒకవైపు ఆయన చేతిపనుల గురించిన జ్ఞానము మనకు అందిస్తూనే, రెండోవైపు అపోహలు, అపార్థములు లేకుండా జాగ్రత్త/హెచ్చరిక ఇస్తున్నారు. మనము లోకమును మన జ్ఞానము అనుసరించి కాకుండా, ఆయన వాక్యము ద్వారా అర్థము చేసుకోవాలి అని ఆయన తలంపు/అభిలాష. మరి నీ జ్ఞానము వాక్యానుసారమైనదా, లేక లోకానుసారమైనదా?
ఈ విధముగా మనకు విజ్ఞానము గురించిన సమాచారము లేఖనములలో ఇచ్చుటద్వారా మనము మన ప్రయత్నములలో ఎక్కడ సమయము వృధా చేసికొనకూడదు అనేది ఆయన ఉద్దేశ్యము. మానవులు చాలా సంవత్సరములు పరిశోధనలు చేసి పరిశుద్ధ గ్రంథములోని విషయములనే కనిపెట్టారు అనేది మనకందరికీ తెలిసిన విషయమే. అయితే మనము ముందుగానే పరిశుద్ధ గ్రంథమును విశ్వసించి ఉంటే ఎంత సమయము కలిసివచ్చేది. ఆ సమయమును మనము మిగతా విషయములను కనిపెట్టుటకు ఉపయోగించుకొనవచ్చు. ఈ విజ్ఞానము ద్వారా మనము గొప్పవాటిని కనిపెట్టాలి అనేది దేవుని ఉద్దేశ్యము. మనము లేఖనములో ఉన్న విషయమును కనిపెట్టి దేవుడు చాలా గొప్పవాడు అని ఆయనకు certificate ఇవ్వవలసిన అవసరము లేదు. ఆయనను certify చేసే స్థితికి మానవాళి ఎప్పటికీ కూడా ఎదగలేదు. ఇవి అన్నీచూపించి, గర్వించే మనస్సు కూడా దేవునికి ఎక్కడా లేదు. ఇవి అన్నీకూడా మనము త్వరగా ఆకళింపు చేసుకుని అభివృద్ధి వైపు అడుగులు వేయటానికి. ఇప్పటికి అయినా ఆయనను సరిగా అర్థము చేసుకుందాము. తిరస్కరించి నష్టపోయినది చాలు. మన జ్ఞానము ద్వారా ఇంత చేయగలిగితే, ఆయన జ్ఞానము ద్వారా ఇంకెంత చేసి ఉండేవారము, చేయగలము అనేది ఆలోచించండి. ఆయనను మించిన గురువు లేడు. ఆయనకు మించి తెలిసినవారు కూడా ఎవరూ లేరు. మిడి మిడి జ్ఞానము కలిగిన వారి దగ్గరకన్నా సంపూర్ణ జ్ఞానము కలవారి యెద్ద నేర్చుకొనుట మేలు కదా.