దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను (1:9-10).
లోకములో ఒక భూమి యొక్క ఎత్తును సముద్ర మట్టమునకు పోల్చి కొలవటము అనేది ఆనవాయితీ. దీనిని బట్టి ఒక సత్యము మనము గ్రహించాలి. నీరు అనేది పల్లపు ప్రదేశములకు సమతలముగా ఉన్న ప్రదేశములకు త్వరగా ప్రవహించే అవకాశము ఉంటుంది తప్ప ఎత్తైన ప్రదేశములకు త్వరగా ప్రవహించదు. అలానే మనము జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పుడెప్పుడు మన హృదయమును మరల ఆక్రమించుదామా అని లోకము ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే మన హృదయమును దేవుని తట్టు మనము ఎత్తుకోవాలి. అప్పుడు మాత్రమే లోకము మరల మనలో ప్రవేశించటము సాధ్యము కాదు. మనము మన హృదయము దేవునికి సమీపముగా ఎంత ఎత్తుకున్నాము అనే దానిమీద మన ఆత్మీయ జీవిత విజయము ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనము మన హృదయమును పైకి కాకుండా లోయ రూపములో క్రిందకి దించుకున్నట్లయితే రక్షణ అనేది లేకుండా ముంపునకు గురికావలసి వస్తుంది. అది చివరకు మనలను నాశనమునకు నడిపిస్తుంది. మన హృదయము దేవునికి ఎంత దగ్గరగా పైకి వెళితే మనము అంత సురక్షితముగా ఉంటాము. దీనికి మనము అనుదినము దేవుని వాక్యమును ధ్యానిస్తూ, అందులోని సత్యమును గ్రహించి, ఆకలింపు చేసుకుని వాటిని మన జీవితములో అవలంబించటానికి సాధన చేయాలి. అప్పుడే అది సాధ్యము అవుతుంది తప్ప ఏదో మంత్రం వేసినట్లుగా జరగదు. ఈరోజు నుంచి మన జీవితములో ఆ పనిని ప్రారంభిద్దాము.
లోకములో ఉన్న సముద్రములను మనము గమనించినప్పుడు ఒక విషయము మనకు అర్థము అవుతుంది. వాటిలో ఉన్న జలరాశి యొక్క పరిమాణము బహు శక్తి కలిగినది. అయినను దేవుడు వాటి చుట్టూ ఏర్పరచిన ఇసుక సరిహద్దు చాల చిన్నది. అసలు సముద్రము యొక్క పరిమాణముతో పోల్చుకుంటే అది లెక్కలోనికి రాదు. అయినా అది దేవుడు నియమించిన సరిహద్దు కాబట్టి అది దానిని దాటి రావటం లేదు. ఆ విధముగా దేవుడు లోకమును కూడా కట్టడిచేసి మనలను రక్షిస్తూ ఉంటారు. లేకపోతే లేఖనము చెప్పిన విధముగా లోకము మనలను ఎప్పుడో మ్రింగివేసి ఉండేది. ఈ కట్టడను జలరాశి దాటి రాకుండటను బట్టి విధేయత గురించి కూడా ఇక్కడ మనము గొప్ప పాఠము నేర్చుకోవాలి. దేవుడు వాటికి సరిహద్దును ఒక్కసారే నియమించటము జరిగినది. అది అప్పటి నుండి ఈరోజు వరకు దానిని మీరలేదు కానీ మనము మాత్రము దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ నుండి అన్నీ మీరుతూ వస్తున్నాము. దేవుని యొక్క సృష్టి మనకు ఎన్నో పాఠములను నేర్పిస్తుంది. సవాళ్లను విసురుతుంది. మనము వాటిని చూసికూడా చాలా నేర్చుకోవాలి. మనకు ఎంత బలము, తెలివి ఉన్నా కూడా దేవుని ఆజ్ఞలకు, హద్దులకు లోబడి బ్రతకాలి. ఎక్కడా గర్వించకూడదు, విర్రవీగకూడదు. విధేయత అనేది మన జీవితములో చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నుంచి దేవుని వాక్యము అనుసరించే, పాటించే విధేయత నేర్చుకుందాము
లోకములో ఉన్న నీరు శ్రమలకు, కష్టములకు కూడా సాదృశ్యంగా ఉన్నట్లు లేఖనముల ద్వారా మనకు అర్థము అవుతుంది. వాటికి దూరంగా ఉండాలి. అవి జీవితములో రాకూడదు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వచ్చిన తరువాత వాటిని విడిపించుకోవటానికి, బయటపడటానికి శాయశక్తులా ప్రయత్నము చేస్తూ ఉంటారు. అయితే వాటినుంచి సంపూర్ణముగా బయటపడాలి అంటే మాత్రమే దేవుని ద్వారానే అది సాధ్యము అని ఈ వచనములో మనకు స్పష్టముగా బోధిస్తున్నాయి. కష్టములు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుని మాట చాలును. మనము ఏమీ చేయవలసిన, కృంగిపోవలసిన అవసరము లేదు అని చెప్తున్నారు. మానవులు ఎంత ప్రయత్నము చేసినా కష్టములు మరలా కొంతకాలానికి వెనుకకు తిరిగి వస్తుంటాయి. వాటికి గల ప్రధాన కారణము మన హృదయములో ఉన్న దురాశలే. దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి లేకపోవుట, ఆయన కలిగి ఉండమని చెప్పినవి కాకుండా వద్దు అని చెప్పినవి కలిగి ఉండుట. ఆ వేరు ఎలా తీసివేసుకోవాలి అనేది మనకు తెలియదు. అందుకే దానిని వేరుతో సహా తీసివేయాలి అంటే దేవుని మాట ద్వారానే అది సాధ్యము అని వాక్యము మనకు తెలియజేస్తుంది. కష్టములు, ఇబ్బందులు చూసి అధైర్యపడి కృంగిపోయి జీవితము చాలించటము, నిరాశ చెందటము కాకుండా దేవుని ఆశ్రయిద్దాము. సంపూర్ణమైన విడుదల పొందుకుందాము