భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను (1:2).
ఇక్కడ వివరించిన స్థితి దేవుని యొక్క తీర్పునకు గురి అయిన ఆత్మస్థితికి కూడా సాదృశ్యముగా ఉన్నది. ఈ తీర్పు అనేది దేవుడు చివరిగా తీర్చేది అని అర్థంచేసుకోవాలి తప్ప dakes, scofield shcolars సాతాను తిరుగుబాటు ద్వారా దేవుడు భూమికి తీర్చిన తీర్పుగా అర్థం చేసుకొనకూడదు. దేవుడు ఏదైనా ఒక పనిచేసి అది సక్సెస్ కానప్పుడు దానిని తీర్పుద్వారా లయపరచి మరొకసారి మెరుగైన ప్రతిసృష్టి చేయడు. అలాగున దేవుడు చేయడము అనేది పరిశుద్ధ గ్రంధంలో ఎక్కడా కనిపించదు. ఆలాగున చేస్తే దేవుడు మొదటిసారి చేసిన పని చేతకానిదిగా అవుతుంది. ఈ లక్షణము ఎప్పుడూ కూడా దేవునికి ఆపాదించడం అసాధ్యం. కాబట్టి వీరి సిద్ధాంతము(gap theory) తప్పు. దేవుని యొక్క సృష్టి ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆయన బాగు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆఖరి అవకాశముగా లయము లేదా తీర్పు విధిస్తారు. ఒకవేళ నాశనము చేసే ప్రతిసృష్టి చేయడము అనేది ఆయన స్వభావము అయితే భూమి మీదకు వచ్చి అంత భయంకరమైన శ్రమ అనుభవించి సిలువ మరణము పొందవలసిన అవసరంలేదు. మానవజాతి మొత్తాన్ని లయపరిచి, సాతానును లయపరిచి మరలా క్రొత్తజాతిని చేసి ఉండేవారు. దేవునిని కోల్పోయినా, దేవుడు లేకపోయినా, దేవుడు కార్యము మొదలుపెట్టకపోయినా, దేవుడు తీర్పుతీర్చినా పరిస్థితి ఇలానే నిరాకారముగాను, శూన్యముగాను అంధకారములో( నిర్జీవ స్థితిలో) ఉండిపోతుంది
మన స్వంత నీతిద్వారా పనులను జరిగించి దేవుని యొక్క వాక్యముతో సంబంధం లేకుండా జీవితం సాగించేవారి పరిస్థితికి కూడా ఇది అద్దం పడుతుంది. మన స్వనీతి అనేది మురికిగుడ్డలతో సమానము అని, అది మనలను పరలోకము చేర్చదు అని పరిశుద్ధ గ్రంధము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది. అవి మనలను అంధకారములోనికే తప్ప నిజమైన వెలుగులోనికి నడిపించలేవు. అలాంటి స్వనీతి కార్యములు చేసేవారు తాము పరలోకమార్గములో ఉన్నాము అని భ్రమలో ఉంటారు. అలాంటి అంధకారములోనుండి మనలను మనము విడిపించుకొనలేము. అది దేవుని వలన మాత్రమే సాధ్యము కాబట్టి ఆయన కలుగజేసుకొనవలసి వచ్చినది. లేకపోతే మన అంతట మనము బయటికి రాగలిగే పరిస్థితి ఉంటే అది ఆయన మనకు స్పష్టంగా తెలియజేసేవారు. ఆయన లేకుండా మనకు వెలుగు లేదు. అంధకారము తొలగించుకోగలిగే శక్తి మనకు లేదు. ఆయన కార్యము చేయకుండా మనకు విడుదల లేదు. కాబట్టి దేవుని సహాయము లేకుండా మన పరిస్థితి కూడా ఇదే అని మనము గుర్తించాలి. అలాంటి స్థితిలో మనము ఆయనకు ఏ రకంగానూ ఉపయోగము లేకపోయినా, ఉపయోగపడకపోయినా, కేవలము మనము బాగుండాలి అని మాత్రమే, మన మేలుకోసమే, స్వలాభము చూసుకోకుండా ఆయన అక్కడ అల్లాడుతున్నాడు. అని మనము గుర్తించి, గ్రహించాలి. అలాంటి తండ్రి ప్రేమ కోల్పోతే మన జీవితంలో ఎన్నిఉన్నా కూడా వృధానే.
దేవుడు కార్యము చేయటము మొదలుపెట్టిన తరువాతనే భూమి ఇంత ఉన్నతముగాను, అందముగాను తయారు అయ్యింది అని గుర్తించాలి. ఇప్పుడు నీవు ఉన్న స్థితి కనుక ఈ వచనములో ఉన్న స్థితిని గనుక ప్రతిబింబిస్తూ ఉంటే నీవు దేవుని విడిచిపెట్టి ఆయినా ఉండాలి లేదా నీలో దేవుని కార్యము ఇంకా ప్రారంభము కాలేదేమో ఆలోచించండి. అలా కొట్టుమిట్టాడుతున్న స్థితిలో మీరు ఉంటే ఇదే శుభ వచనము. నిరీక్షణ ఉంచండి. దేవుడు మీ పరిస్థితి మార్చాలి అని నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు. నీవు ఈ అంధకార స్థితిలోనే ఉండవలసిన అవసరం లేదు. నీవు వెలుగులోనికి మహిమకరముగా ప్రవేశించబోవుతున్నావు. నిరాకారముగాను శూన్యముగాను ఉన్న పరిస్థితిని మార్చబోతున్నాడు. నీ ప్రయత్నములు అన్నీ విడిచిపెట్టి ఆయనకు అవకాశం ఇవ్వు. నీ జ్ఞానము కాకుండా ఆయన జ్ఞానమునకు స్థానము ఇవ్వు. పరిస్థితులు మారినప్పుడు ఆయనతో మీ సంబంధము ఒకసారి పరిశీలించుకొనండి. సరిదిద్దుకొనండి. దేవుని ఆత్మయొక్క మెల్లని స్వరమునకు చెవియొగ్గి విధేయత కలిగి ఉండండి. తిరుగుబాటు హృదయములు కూడా ఇలానే అంధకారములో మునిగిపోయి నాశనముకు గురిఆయి నశించిపోతాయి. విధేయత మాత్రమే మనలను రక్షిస్తుంది. అంధకారమునుండి తప్పిస్తుంది. అన్నిటికన్నా మిన్న అయిన వెలలేని ప్రేమ మనకు లభిస్తుంది. లెమ్ము, తేజరిల్లుము. ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది
స్తుతి
- ఆయన మన అవసానదశలో మన మీద చూపిస్తున్న జాగ్రత్త కొరకు
- పరలోకంనుండి దిగివచ్చి మన ప్రక్కన నిలబడి మనకు అందిస్తున్న మోరల్ సపోర్టు, నైతిక ధైర్యం కొరకు
- గొప్ప తండ్రిగా ఆదరిస్తున్న ఆయన ప్రేమ కొరకు
- మనలను బయటికి తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నము కొరకు
- మన దీనస్థితిలో ఆయన చూపిన జాలి కొరకు
ఆరాధన
- మన జీవితమును వెలిగించే బాధ్యత ఆయన చేతులకి అప్పగించి, ఆయన ఆత్మ స్వరమునకు సంపూర్ణమైన విధేయత కలిగి ఉండటము ద్వారా ఆయనను ఆరాధించాలి.
హెచ్చరికలు
- స్వనీతి మనలను అంధకారములోనికి నడిపిస్తుంది.
- దేవుని యొక్క వాక్యానుసారము మనము జీవించకపోతే జీవితము శూన్యము అవుతుంది. అంధకారము మనలను ఆవరిస్తుంది.
ప్రార్ధన
- ప్రభువా మా అపరాధములు క్షమించి చీకటినుంచి మమ్మలను విడిపించండి.
- నీ స్వరూపమునకు సంపూర్ణత విధేయత కలిగి ఉండడానికి నేర్పించండి
సత్యము
మన సంతోషములోను దుఃఖములోను దేవుడు ఎల్లప్పుడు మనతో ఉంటారు. ఎవరు మనలను చేయివిడిచినా, మనతో ఉన్నా లేకపోయినా ఆయన ఎల్లప్పుడు మన పక్కనే ఉంటారు. నేను నిన్ను విడువను, ఎడబాయను అని ఆయన ఇచ్చిన వాగ్దానమనకు నిలువెత్తు నిదర్శనము ఈ వచనము. మన కన్నీరు తుడిచి మనలను మరలా లేవనెత్తేవరకు ఆయన విశ్రమించడు. మన మనస్సులు అలముకున్న కృంగుదల వలన మనము చూడలేకపోవచ్చు కాని ఆయన మాత్రము మనతోనే ఉన్నాడు. విశ్వసించు, అధైర్యపడకు ఆయన చేతినుంచి ఏది నిన్ను ఎత్తుకునిపోలేదు. నీవు ఆయనను విడిచి పారిపోవలసినదే తప్ప ఆయన మాత్రము ఎప్పుడూ నీ చేయి విడువడు. ఆయన సంరక్షణలో నీవు ఎల్లప్పుడూ సురక్షితము.