మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను (1:6-8).
ఇదే ఆకాశములో దేవుని చేత సృజించబడిన దేవదూతలు కూడా ఉన్నారు. వీరియొక్క నివాసస్థలము పరలోకము అని పరిశుద్ధ గ్రంథములోని లేఖనముల ద్వారా మనకు అర్థము అవుతూ ఉన్నది. దేవుని సన్నిధిలో ఆయన సముఖములో ఎల్లప్పుడూ సంచరించే వాటికికూడా తన గురించి తెలుసుకునే అవకాశము దేవుడు ఇవ్వలేదు. వాటికన్నా తక్కువ స్థాయిలో చేయబడిన మనతో మాత్రమే దేవుడు ఒక ప్రత్యేకమైన అనుబంధమును కలిగిఉన్నారు. దేవుడు మనతో చేస్తున్న కార్యముల ద్వారానే దేవదూతలు కూడా ఆయన గురించి తెలుసుకుంటాయి అని హెబ్రీ పత్రిక సెలవిస్తుంది. అంతటి మహిమలో నివసించే దేవదూతలను సహితము దేవుడు మన భద్రత మరియు పరిచర్య కొరకు వినియోగించుటము జరిగినది. అందుకు దూతలు కూడా ఆనందముగా అంగీకరించాయి. అయితే మనము ఆయనకు పరిచర్య చేసే విషయములో ఎలాంటి standard follow అవుతున్నాము అనేది ఆలోచించాలి. దేవదూతలకు ఉన్న విధేయత మనకు లేదు. మనకు వాటిలాగా తగ్గించుకుని లోబడటము రావటము లేదు. పరలోకమునుండి భూమిమీదకు మనకోసమే ప్రయాణము చేస్తూ ఉంటాయి. మనము దేవుని కోసము ఎంత దూరము వెళ్తున్నాము. ఆయన సేవను ఎలాంటి దృక్పథముతో చూస్తున్నాము. ఇప్పటికైనా ఆయన మనకొరకు చేస్తున్న వాటిని కన్నులతో గుర్తిద్దాము
ఈ ఆకాశమును మనము గమనించినపుడు ఆయన మనకొరకు సిద్ధపరచిన నగరము, క్రొత్తభూమి కూడా మనకు కనిపిస్తాయి. అవి ఇప్పుడు మనకు అందుబాటులో లేవుగాని ఆయన మాట ప్రకారము నడుచుకునే వారికి మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి. ఆ నగరములో మనకొరకు నిర్మించబడిన నివాసములు, వాటి అందము, వాటి విలువ గమనించినపుడు వాటిని వర్ణించటము బహు కష్టతరముగా ఉంటుంది. మనము భూమిమీద కట్టుకునే గృహములు వాటితో పోలికకు కూడా సాటిరావు. బంగారపు నేలమీద, మణులు, మాణిక్యములతో కట్టబడి మనకు ఉచితముగా ఇవ్వబడుతున్నాయి. మనము లోకములో కట్టుకున్న ఇండ్లకే EMI జీవితాంతం కడితే మరి వాటికి ఎన్ని జన్మలు కట్టాలి. కానీ మనుష్యులు అలాంటి దేవుని అద్భుత నివాసము గురించి విచారించక, భూమిమీద ఇటుకులతో కట్టిన గృహముల గురించి విచారించటము బాధాకరము. ఒకవేళ దేవునికి వెల చెల్లించవలసి వస్తే ఆ గృహములను మనలో ఎవరు కొనగలము? మనమీద ఎంత ప్రేమ లేకపోతే అంత సుందరమైన రమ్యమైన కోటీశ్వరుల ఇండ్లను తలదన్నే గృహమును దేవుడు మన కోసము నిర్మిస్తారు. ఆయన కోసము వేరుపరచబడి మనము నష్టపోయేది ఏదీలేదు గాని పొందుకునే లాభములే అపరిమితము. ఆయన ఇచ్చిన ఇండ్లు భూలోకములో లాగా వన్నెతగ్గవు depreciation, decay ఉండదు. అవి శాశ్వత శోభాతిశయముతో విరాజిల్లుతుంటాయి
ఆ పరలోకములో ఆకాశములోని నివాసస్థలములో మనము దేవునితో శాశ్వతకాలము నివాసము చేస్తాము. ఆ సమయములో మనము దేనికోసము ప్రయాసపడి పనిచేయవలసిన అవసరము లేదు. మనకు ఎక్కడా కన్నీరు, బాధ అనేవి ఉండవు. సమస్తము కూడా దేవుడే చూసుకుంటారు. ఈ లోకములోని తల్లిదండ్రులు తమ పిల్లలను ఆలాగున చూసుకోవటము అసాధ్యము. ఈ లోకములో ఉండగా మనము ఆయన ద్వారా పొందుకున్న ప్రేమకన్నాఎన్నోరెట్లు ఎక్కువ ప్రేమను మనము పరలోకములో పొందుకుంటాము. దేవునితోటి మనము నడిచే ప్రతి stage లోను ఆయన మనకు ఇచ్చే సంతోషము రెట్టింపు అవుతుంది తప్ప తగ్గిపోదు. అందుకే ఆకాశము యొక్క విలువ మన జీవితములలో చాలా గొప్పది. మరి ఈ లోకములో ఒక stage నుంచి మరొక stage కి వెళ్తున్నప్పుడు దేవునిమీద మన ప్రేమ తగ్గిపోతుందా, పెరిగి రెట్టింపు అవుతుందా అనేది మనము సరిచూసుకోవాలి. మన భక్తి, విధేయత, ఆరాధన అంతకంతకు రెట్టింపు అవ్వాలి తప్ప రోజులు గడిచేకొద్దీ చల్లబడిపోకూడదు. దేవుని కోసము ఎల్లప్పుడూ మనము మండుతూ ఉండాలి. ఆయనను గురించిన ఆసక్తి మనలను ఎప్పుడు భక్షిస్తూ ఉండాలి