దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గలవాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. (1:24-25)
పశువులు తమ యజమాని స్వరమును గుర్తించి అతను పిలిచినపుడే స్పందిస్తాయి. మిగిలిన ఎవరూ కూడా పిలిచినా స్పందించవు. వారి మాట వినవు. ఒకవేళ యజమాని ఎవరైనా పనివాని పెట్టుకుంటే అతనికి లోబడి ఉంటాయి. అలానే మనము కూడా యజమానుడైన దేవుని యొక్క స్వరమును గుర్తించి ఆయనకు మాత్రమే స్పందించాలి. ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును అని లేఖనము కూడా చెప్పుచున్నది. మనము ఆయన స్వరము వినలేకపోతే ఆయన మేపు గొర్రెలము కాలేము. ఒకవేళ ఎవరైనా వేరే వ్యక్తి వచ్చి పచ్చగడ్డి చూపించి ఆశ పెట్టినపుడు అది అతని వెంబడి వెళ్లినట్లయితే దొంగతనమునకు గురి అయి కసాయి వాణి చేతిలో అంతమయ్యే అవకాశము ఉంటుంది. దానిని సరిగా సాకాలి అనే ఉద్దేశ్యము కలిగిన వ్యక్తి అయితే దాని యజమానితో మాట్లాడి కొనుగోలు చేస్తాడు తప్ప దొంగతనముగా తీసుకువెళ్లడు. అలానే మనము కూడా సాతానూ చూపించే ఆకర్షణలకు లొంగి వాడి వెంబడి పోకూడదు. మన ఆత్మను నాశనము చేసుకొని నరకములో పడతాము. నీవు నీ యజమానుడైన ప్రభువు స్వరము గుర్తించి ఆయనకు స్పందిస్తున్నావా? లేక ఆకర్షణకు లోనయి నీ శరీరములోని కోరికలను తృప్తి పరచుకోవటానికి సాతాను యొక్క స్వరమును వెంబడిస్తున్నావా? నీవు ఎటు వెళ్తున్నావు అనే దానిని బట్టి నీ గమ్యము ఆధారపడి ఉంటుంది. దానికోసము మరణము వరకు వేచి చూడాల్సిన అవసరము లేదు.
లోకములో ఉన్న పశువులు తమ వయస్సు ఎక్కువ అయి శక్తి కోల్పోయినపుడు కసాయి వానికి అమ్మివేయబడతాయి. అయితే మన ప్రభువు అలా మనలను అమ్మివేయనందుకు, తృణీకరించనందుకు కృతజ్ణతలు. తన సేవకుల యొక్క మరణము ఆయనకు విలువైనది అని పరిశుద్ద గ్రంధము తెలియజేస్తుంది. ముదిమి వయస్సులో మనలను కసాయి వాణి చేతిలో పడవేయకుండా చంకనెత్తుకుని పోషించిన, ప్రేమించిన దేవుని ఋణము, కృతజ్ణత మనము ఎలాగు తీర్చుకొనగలము. ఆయన ప్రేమను గుర్తిద్దాము. ఆయన మనస్సు అర్ధము చేసుకుని నడుచుకుందాము. ఆయన సేవకులమై ఉండుట ఎంతటి అదృష్టమో తెలుసుకుందాము. లోకములో పనివారిని స్నేహితులుగా చూసేవారు, ప్రేమించేవారు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు. అవును. ఆయనకు సాటి అయినవారు లేరు. ఆయన మంచి యజమాని. తన పనివారి కొరకు ప్రాణము సహితము ధారపోయగలిగినవాడు. వారి బంధకములను విడిపించువాడు. క్షమించువాడు. ఆయన నుంచి మనము రుచి చూసిన ప్రేమ ఏదైతే ఉన్నదో అదే మనము ఇతరులకు కూడా చూపించాలి. అందుకే ఆయన నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించవలసినదే అనే ఆజ్ణ ఇచ్చారు. మరి నీ యజమాని మనస్సు, విలువ, ప్రేమ నీవు గుర్తించావా? ఇతరులను ఆయన నిన్ను ప్రేమించట్లే ప్రేమిస్తున్నావా? నీకు వచ్చినట్లు, నచ్చినట్లు ప్రేమిస్తున్నావా?.
పశువులు తమ పిల్లలను తీసుకుని వెళ్లేటపుడు వాటిని మద్యలో పెట్టుకుని వాటికి కుడి, ఎడమల పెద్దవి రక్షణగా నడుస్తాయి. ఎవరైనా వాటిని సమీపించినా, వేరేవి దాడి చేసినా తమ ప్రాణములు అడ్డుపెట్టుకుని వాటిని రక్షించుకుంటాయి. ఈనాటి దినములలో సేవకులు, విశ్వాసులు తమ పిల్లలను ఇదే విధముగా సంరక్షించుకోవాలి. తల్లితండ్రులుగా వారిమీద సాతానుడు చేస్తున్న దాడులను సమర్ధవంతముగా ప్రార్ధన ద్వారా త్రిప్పికొట్టాలి. ఊరిలో ఉన్న అందరికీ ఎలాగు మనము ప్రార్ధనలు, కౌన్సెలింగ్ చేస్తామో అలానే మన పిల్లలకు ప్రార్ధన చేసి, వారికి నేర్పించాలి. వారి వయస్సునకు, గ్రహింపునకు తగిన బోధ, కౌన్సెలింగ్ చేయాలి. లేకపోతే సాతాను వారి హృదయములను దొంగలించి, మోసపరచి మనకు అడ్డుబండలుగా మార్చే అవకాశము ఉన్నది. ఈ రోజున సేవకుల పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది మనము బయట చూస్తూనే ఉన్నాము. వారు దారి తప్పిపోతే సరిదిద్దవలసిన భాద్యత మనదే. మనము సేవ చేస్తూ మన తరువాతి తరమునకు తర్ఫీదు ఇచ్చి సిద్దపరచాలి. మన తప్పులు వారు చేయకుండా జాగ్రత్తపడాలి. నీ సంతానము గురించి ప్రార్ధనలో పోరాడుతున్నావా? లేక లోకమునకు మాత్రమే సేవ చేస్తున్నావా?. నీ సంతానము నీ తరువాతి తరములో ప్రభువు కొరకు నిలబడేలాగున తీర్చిదిద్దబడుతున్నారా లేక చేయి దాటిపోయారా?