దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (1:5).
దేవుడు పేరు పెట్టిన విధానము మనము పరిశుద్ధ గ్రంథములో గమనించినప్పుడు వ్యక్తులను ఆయన పిలిచిన పిలుపునకు తగినట్టుగా, లేదా వారిని ఆయన ఏలాగు తీర్చిదిద్దాలి, వారు ఏమవుతారు అనే దానినిబట్టి పేర్లు నిర్ణయించటము, మార్చటము జరిగినది. పేరు అనేదానికి దేవుని దగ్గర చాలా విలువ, ప్రాముఖ్యత అనేవి ఉన్నాయి అని దీనినిబట్టి మనకు అర్థమవుతుంది. అందుకే మన పేరును మనము ఎల్లప్పుడూ నిర్లక్ష్యముగా భావించకూడదు. ఏదో ఒక గుర్తింపుకొరకు మిగిలిన వారినుంచి తేడా చూపించుటకు ఇచ్చిన ID cardగా అనుకోకూడదు. దానిలో ఆయన చిత్తము, నీ జీవితము పట్ల ఆయనకు గల ఉద్దేశ్యము ప్రస్ఫుటముగా కనిపిస్తుంది. ఈ లోకములో తల్లితండ్రులు తమ బిడ్డలకు అందమైన, పిలవడానికి బాగుండే పేర్లు పెట్టవచ్చు. బైబిల్ లో కొంతమంది వారు పుట్టిన పరిస్థితులకు అనుగుణముగా పేరు పెట్టటము జరిగినది. కానీ దేవుడు మాత్రము నీ ఘనతకొరకే నీకు నామకరణము చేయటము జరిగినది. ఈ లోకంలో ఎన్ని కోట్లమంది ఉన్నా అందరితో సమానముగా గుంపులో నిన్ను కలపకుండా గుర్తింపునిచ్చారు. మిగతా సృష్టిలో ఒకేజాతి జీవులు అన్ని కలిసి ఒకే పేరుతో పిలువబడితే(పులి, సింహం, ఏనుగు…) నీవు, నేను మాత్రము ఒక్కోక్కరము ఒక్కొక్క పేరు ప్రత్యేకముగా పొందియున్నాము. దేవుడు ఎంతమందిలో ఉన్నా నిన్ను గుర్తిస్తున్నారు. నీవు ఆయనను అదే రీతిగా గుర్తించి ఆయనను గౌరవిస్తున్నావా? కృతజ్ఞతగా ఉన్నావా?
దేవుడు పేరుపెట్టిన విధానము గమనించగా భూలోకములో ఉన్నంతవరకూ ఒక పేరు. మనము పరలోకములో వెళ్లిన తర్వాత మరియొక క్రొత్తపేరు ఇవ్వటము జరుగుతుంది. అనగా మనము ఎక్కడ నివాసము చేస్తూ ఉన్నామో అక్కడ ఆ ప్రదేశము యొక్క మహిమకు ఘనతకు తగినట్లుగా ఆ పేరు ఇవ్వటము జరుగుతుంది. నరకములోనికి వెళ్లినవారి పేర్లు అసలు జ్ఞాపకములోనికి రావు. మన తరువాత కేవలము నక్షత్రములు మాత్రమే వ్యక్తిగత నామములు కలిగి ఉన్నాయి. పరలోకజీవులలో కేవలము కొందరి పేర్లు మాత్రమే మనకు ఉదహరింపబడినాయి. దీనినిబట్టి ఈ సృష్టిలో మనకు ఉన్న ప్రత్యేకత, మన పేరునకు ఉన్న విలువ మనము గుర్తించాలి. ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. ఫలానా వ్యక్తిలాగా జీవించాలి అనే మాదిరి మనము చూపించాలి. మనలో ఎవరు కూడా తప్పిపోవటము ఇష్టములేక జీవగ్రంథము అనే attendance register పెట్టి దేవుడు మనము అందులో చేరేవరకు ఆలస్యము చేయటము జరుగుతుంది. నిన్ను ప్రత్యేకముగా గుర్తించి ప్రేమిస్తున్నాడు కాబట్టే జాతిలోను, గుంపులోను కలిపివేసి పిలవకుండా నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నారు. చాలామంది క్రైస్తవులకు ఈ రోజున వారు కలిగిఉన్న పేరు విలువ తెలియదు. వారి జీవిత విధానము బహు సిగ్గుకరముగా ఉంటున్నది. మనము కూడా ఆయనలాగే తిరిగి ప్రేమిద్దాము. ఆయన నామముల ద్వారా ఆయనను ఎరుగుదాము. ఎక్కడ ఉంటే అక్కడ దానికి తగిన మహిమతో ఆయనను ఆరాధించుదాము.
దేవుడు తన సృష్టిలో కేవలము జీవము కలిగినవాటికి మాత్రమే కాకుండా జీవములేని వస్తువులకు కూడా పేరు పెట్టటము జరిగింది. ప్రతిదానికి వాటి పేర్లుద్వారా మన జీవితములో అవి ఎలాంటి పాత్ర పోషించాలి అనే మార్గదర్శకములు ఆయన పరిశుద్ధ గ్రంథములో ఇవ్వటము జరిగినది. వాటిలో కొన్నిఉండవలసినవి ఉన్నాయి. కొన్ని ఉండకూడనివి ఉన్నాయి. దేవుడు మొదటిసారి సృష్టిని చేయాలి అని తలంచినప్పుడు ఏదీ కూడా ఉండకూడదని list జాబితాలో లేదు. అవి సృజింపబడిన, చేయబడిన తరువాత దారితప్పి పాపమునకు స్థానము ఇవ్వటమును బట్టి అవి వేరే జాబితాలో చేర్చబడ్డాయి. అలాగే మన పేరుకూడా పాపము ద్వారానే అపకీర్తి, ఘనహీనతకు లోనవుతుంది తప్ప దేవుడు కావాలని మనలను పుట్టించినప్పుడు ఆ విధముగా చేయలేదు. కాబట్టి నీ పేరు వెలుగులో ఉండాలా, చీకటిలోనికి వెళ్లిపోవాలా అనేది నీ చేతిలో, ఆలోచనలలో, క్రియలలోనే ఆధారపడి ఉంది. ఇందులో దేవుని నిందించుటకు, వేలెత్తి చూపించుటకు ఏ విధమైన ఆస్కారము లేదు. నీ పేరు పొరపాటున చీకటిలోనికి వెళ్లేలా నీవు చేసుకుని ఉన్నట్లయితే మరలా దానిని యదార్ధ స్థానములోనికి, వెలుగులోనికి తెచ్చుకోవటానికి ఆయన, రక్షణ అనే మార్గము ద్వారా యేసు అనే పేరులో మనకు అవకాశము ఇచ్చియున్నారు. నీవు ఆ పేరును ఎరిగియుండుట నీ మేలునకు ఎంతో అవశ్యకము.