ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (1:1).
దేవుడు తన శక్తిని మనకు అందుబాటులో ఉంచారు
దేవుడు ఈ సమస్త సృష్టిని కూడా తన నోటిమాటతో చేయడము జరిగినది. కేవలము మాట ద్వారా జరిగినది ఎంత గొప్పదో , అందమైనదో మనము కన్నులారా వీక్షిస్తున్నాము. దీనినిబట్టి ఆయన నోటిమాటకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అనే విషయము మనకు అర్థం అవుతూ ఉంది. ఆయన మాటకు లోబడునటువంటిది, దానిని ఎదిరించగల శక్తి ఈ విశ్వములో దేనికికూడా లేదు. కేవలము మానవులమైన మనము మాత్రమే దానికి లోబడకుండా తిరుగుబాటు చేస్తూఉంటాము. అటువంటి ఆయన మహత్తరమైన శక్తి, బలము కలిగిన మాటను పరిశుద్ధ లేఖనముల రూపములో ఆయన మన చేతిలో ఉంచటము జరిగినది. ఈ యొక్క లేఖనముల ద్వారా సమస్త దుర్నీతిని, కీడును జయంచమని దేవుడు సెలవిచ్చారు. వాటిని మనము అందరమూ కూడా అర్థం చేసుకునే రీతిలో ఎంతోమంది తమ ప్రాణములు, ధనము, సమయము వెచ్చించి తర్జమా చేయడము జరిగినది. ఈ లేఖనముల యొక్క శక్తిని, విలువను వాటి వెనుక ఉన్న త్యాగము మానవులు ఇంకా గ్రహించలేకపోవడము, విశ్వాసులయొక్క దృక్పధము కూడా సరైన రీతిలో లేకపోవడము చాలా విచారకరము, దురదృష్టము కూడా. ఇకనైనా మన చేతిలో ఉన్న ఆయుధము యొక్క విలువను గొప్పతనాన్ని గుర్తిద్దాము. సాతాను యొక్క దుర్గములను పడద్రోసి దేవుని రాజ్యమును కలిసి నిర్మిద్దాము.
ఆయన తన దృష్టికి మరుగైనది ఏమీ కూడా లేదు
మనము ఏదైనా ఒక ఇంటిలో, ఊరిలో నివాసము చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన వివరములు అన్నీకూడా మనకు తెలిసే ఉంటాయి. ఒకవేళ ఆ ఇల్లు లేదా ఊరు మనచేత నిర్మించబడినది అయితే దానికి సంబంధించిన వివరములు చాలా క్షుణ్ణంగా తెలుస్తాయి. అలానే దేవుడు ఈ విశ్వమును సృజించారు కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి విషయము రహస్యములు ఆయనకు క్షుణ్ణముగా తెలుసు. ఆయన కనుదృష్టికి మరుగైన ప్రదేశము ఏదీకూడా ఉండదు. అందుకే భక్తుడైన దావీదు తన కీర్తనలలో నీ సన్నిధినుంచి నేను ఎక్కడికి పారిపోగలను అని సెలవిస్తున్నాడు. సృష్టికర్త అయిన ఆయన కనుసన్నలలోనే మనము అనుదినము చలిస్తున్నాము. దీనిలో రెండు విషయములు మనము గుర్తించాలి. ఆయన కనుదృష్టి మనలను చూస్తూ ఉంది కాబట్టి ఏదీకూడా మనలకు హానిచేయదు అని ధైర్యంగా ఉండవచ్చు. రెండవది ఆయన కనుదృష్టి, సన్నిధిలోనే మనము చెడును, పాపమును కూడా చేస్తున్నాము అని. నాలుగుగోడల మధ్య మనుషులకు మరుగై ఉండవచ్చు కానీ ఆయనకు మనము చేసే ఏ కార్యము కూడా మరుగై ఉండలేదు అని గుర్తించాలి. సృష్టికర్తగా ఆయన దీనిమీద సర్వహక్కులు కలిగి ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నిలబడి నివసించడానికి మనకు ఎక్కడ అడుగు స్థలము కూడా లేదు అని గుర్తించాలి. మనము ఆయనకు ఇష్మటమైన రీతిగా జీవించకపోయినా కానీ మనలను త్రోసివేయని ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి.
సృష్టి మనకు విధేయతను నేర్పిస్తుంది
ఈ మహత్తరమైన సృష్టిలో దేవునిచేత చేయబడిన గొప్ప పరిమాణము కలిగిన గ్రహములను, ప్రకృతిని, నక్షత్రములను మనము గమనించినప్పుడు అవి అన్నీ కూడా మనకు విధేయత నేర్పిస్తున్నాయి. సృష్టించబడిన దినమునుంచి అవి అన్నీకూడా నిర్దేశిత కక్ష్యలో నిర్దిష్టమైన వేగంతో తిరుగుతున్నాయి. వాటికి నిర్దేశించిన గమనమునుంచి అవి లేశమాత్రమైన ఆటు ఇటు జరుగుటము లేదు. ఆయనకు లోబడి ఉన్నాయి. ఒకవేళ అవి గమనమును మార్చుకున్నట్లయితే వేరే గ్రహములకు, నక్షత్రములకు గుద్దుకుని నశించిపోయే ప్రమాదము కలదు. దేవుడు కూడా మనకు పరిశుద్ధ గ్రంధము ద్వారా నిర్దేశిత మార్గదర్శకములను ఇవ్వటము జరిగినది. వాటిని పాటించే మనిషియొక్క జీవన ప్రమాణములు అద్భుతముగా ఉంటాయి. వాటిని త్రప్పి మనము అవిధేయత చూపితే ఆ గ్రహములకు పట్టిన గతే మనకుకూడా సంభవిస్తుంది. మన జీవితము గతితప్పి అదుపులేకుండా నాశనము ఆవుతుంది. వాటితో పోల్చుకుంటే మనము పరిమాణములో చాలా చిన్నవారము. గొప్పవి అంత విధేయత కలిగిఉన్నప్పుడు చిన్నవి మరింత విధేయతగా ఉండాలి అని గుర్తిద్దాము. మన జీవితము ఎటువంటి ప్రమాదములకు లోనుకాకుండా దేవునికి విధేయత కలిగి జీవిద్దాము. మరికొంతమందికి మాదిరికరముగా ఉందాము.