ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (1:1).
పరిశుద్ధగ్రంథములోని లేఖనముల ప్రకారము దేవదూతలకు కూడా ఆయనను గురించి తెలుసుకునే అవకాశంలేదు వారిలో ఎవరితోనూ ఆయన ఎలాంటి సంబంధము(మనతో ఉన్నలాగున) కలిగిలేరు. వారిలో ఎవరికి ఆయన స్వరూపము, పోలికే ఇవ్వలేదు. ఎవరికీ తన చేతి పనులమీద అధికారము ఇవ్వలేదు. వారు పాపం చేస్తే శిక్షించారు తప్ప విడుదల ఇవ్వలేదు. కానీ మనము దేవదూతలతో పోల్చుకుంటే చిన్న వారము అయినా, వాటి శక్తితో పోల్చుకుంటే మన బలము ఎంతో కొరగానిది అయినా కూడా, అవి నిత్యము ఆయన సన్నిధిలో ఉండి ఆరాధించినా కూడా మనకు ఉన్న అవకాశములు వాటికి లేవు. దేవుని యొక్క కార్యములు తొంగి చూడటంద్వారా ఆయన గురించి అవి తెలుసుకోవలసినదే తప్ప, లేఖనములు లేవు. పైగా అవి మనకు పరిచర్య చేయటానికి నిర్మించబడ్డాయి. ఇప్పటికైనా దేవుడు మనకు ఇచ్చిన అవకాశములు గుర్తించులాగున మన కన్నులు తెరుద్డాము. ఆయన మనకొరకు పడుతున్న ఆతృత, తపన అర్థము చేసుకుని స్పందిద్దాము.
సృష్టికర్తకు తాను తయారుచేసిన వస్తువుల గురించిన పరిపూర్ణ జ్ఞానము ఉంటుంది. ఈ భూమికి పునాది వేయకముందే ఆయన మన గురించి ఆలోచించి ప్రణాళిక వేశారు అని లేఖనము సెలవిస్తుంది. సృష్టికర్తగా నీకు ఏది మంచిది, ఏది చెడు, నీవు ఎలాంటి పరిస్థితుల్లోఇమడగలవు, ఎలాంటి పరిస్థితులు నీకు పడవు అనేది ఆయనకు బాగా తెలుసు. మన గురించి మన తల్లి తండ్రి కన్నాకూడా ఆయన ఎక్కువ జ్ఞానము కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన సృష్టిలో నీకు అవసరము అయినవి అన్నీ కూడా సమకూర్చి ఇచ్చారు అని విశ్వసించు. నీకు లేనివి నీకు హానికరములేమో గుర్తించు. ప్రతిదీ కూడా ఆయన సలహా మేరకు పనిచేస్తే మన జీవితము అన్నివిధాలా సంతోషంగా ఉంటుంది. మనము ఆయనకు అవిధేయులుగా ఉన్నాకూడా మన మనుగడ కొనసాగించడానికి అవసరమైనవి అన్నీకూడా ఉచితముగా, ధారాళముగా అనుదినము దయచేయుచున్న దేవునికి ఎన్నివందనములు చెల్లించినా కూడా తక్కువే.
మనము తయారుచేసిన వస్తువు ఏదైనా మనము ఆశించిన రీతిలో పని చేయనప్పుడు దానిని మనము అవతల పారవేస్తాము. లేదా దానిని ఏ పార్ట్ ఆ పార్ట్ ఊడదీసి ప్రక్కన పెట్టేస్తాము. అయితే మనలను సృజించినప్పుడు దేవుడు కలిగివున్న ప్రణాళిక ప్రకారము మనము నివసించకపోయినా కూడా ఆయన మనలను దీర్ఘశాంతముతో సహిస్తూ ఉన్నారు. మనలను లయపరచకుండా విడుదల కొరకు ఆయన కుమారుని పంపారు. ఆయన కుమారుని త్యాగము మనము అర్థంచేసుకొని ఆయన దగ్గరకు వెళ్లేలాగున పరిశుద్ధాత్ముని భూమిమీద మనకు తోడుగా, సహకారిగా ఉంచారు. కానీ ఏదో ఒకరోజు మనము ఆయన న్యాయ సింహాసనము ఎదుట నిలువవలసి ఉన్నది. అందుకే ఆ దినము రాకముందే మనలను మనము సరిచేసుకుందాము.
ఈ విషయములు అన్నీకూడా గమనించినప్పుడు ఒకటి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, అది ఏమిటి? ఈ లోకములో మనము ఉన్నంతకాలము సంపూర్ణముగా గ్రహించలేనిది, అర్థము చేసుకోలేనిది ఏదైనా ఉన్నదీ అంటే అది ఆయన ప్రేమ మాత్రమే. మిగతావి అన్ని మానవుడు తన మేధోసంపత్తితో ఏదో ఒకరోజు తెలుసుకోగలడేమో.
ఆయన సృష్టించిన ప్రకృతి మనతో అనేక విషయములు తెలియజేస్తుంది అని పరిశుద్ధ గ్రంధము సెలవిస్తుంది. మనము ఆయన చేసిన ప్రకృతితో సమయం గడిపి దాని గురించి ఆలోచించటానికి సమయం వెచ్చించినపుడు మనకు ఇంకా అనేక సంగతులు బోధపడతాయి.
ఈ ప్రకృతిలో గొప్పవి ఎన్ని ఉన్నాకూడా ఒక మనిషితో సహవాసము, అతడు మారుమనస్సు పొందడము దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మన ఆనందము కొరకు ఇంత చేసిన దేవునికి మారుమనస్సు కలిగిన హృదయముతో ఆనందము కలిగించటము మన కనీస బాధ్యత.
దేవుడు తలుచుకుంటే శాస్త్రవేత్తల భాషలో వారికి అర్థం అయ్యేలాగున సైన్స్ భాషలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితశాస్త్ర ఫార్ములాల రూపంలో బైబిల్ రాయించి ఉండవచ్చు కానీ మనలో అందరమూ కావాలి అని చెప్పి , ఇంగిత జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే శైలిలో అనుదిన వాడుక భాషలో బైబిల్లోని లేఖనములను వ్రాయించడము జరిగినది. ఆయనకు నువ్వు కావాలి.