దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గలవాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. (1:24-25)
మేత మెసేటటువంటి విషయములో కూడా పశువులకు ఏ విధమైన ఎంపిక ఉండదు. యజమాని పొలము నుండి తెప్పించిన పచ్చ లేదా ఎండు గడ్డి వాటికి పెడతాడు. ఉదయము ఒకసారి, సాయంత్రము ఒకసారి నీరు, కుడితి పెడతారు. మద్య మద్యలో ఉలవలు. కొన్నిసార్లు యజమానుడు వాటిని తోలుకుని పొలముల యొద్దకు, గడ్డి లభించు ప్రదేశములకు తీసుకొని వెళ్తాడు. స్నానము కూడా అతని చిత్తము అనుసరించి సమయము దొరికినపుడు చేయిస్తాడు. ఇక్కడ అతను పెట్టినది తినటము, అతను తీసుకువెళ్లిన ప్రదేశములో దొరికినది తినటము తప్ప, నేను ఫలానాదే తింటాను, ఫలానా చోటే తింటాను అనే అవకాశము పశువునకు లేదు. మరి మనము ప్రభువు దగ్గర కూడా అలానే సంతుష్టి కలిగి ఉన్నామా లేక మనకు ఉన్న అవసరతల గురించి ఏకరవు పెట్టె విధముగా ఉన్నామా? మన యజమానుడు మన అవసరతలను ముందే ఎరిగినవాడై ఉన్నందుకు, మనలను కంటికి రెప్పలా సాకుతున్నందుకు ఆయనకు ఎనలేని కృతజ్ణతా స్తుతులు. మొదట నా రాజ్యమును, నీతిని వెదకే పనిలో ఉండండి, మీ పోషణ భాద్యత నాది అని ప్రభువు చెప్పినమాట జ్ణాపకము ఉన్నదా? నీ సేవలో నీ యజమానుడు నీకు ఇచ్చిన దానితో సంతృప్తి కలిగి ఉన్నావా? Demanding గా ఉన్నావా?
పశువులు పిల్లలు కనిన తరువాత వాటిని టమాటో పాటే ఉంచుకొని పోషిస్తూ అవి పెరిగి పెద్దవి అయిన తరువాత తమ యజమాని యొక్క సేవలోనే అని వినియోగించబడతాయి. అవి ఎన్ని పిల్లలను కన్నూ అవి యజమాని ఆధీనములోనే ఉంటాయి. పశువునకు బిడ్డను వేరే ఇంటికి పంపటానికి కానీ, పని చేయించకుండా ఉండటానికి కానీ అవకాశము,అధికారము లేదు. మరి నీ బిడ్డల మీద నీ అధికారము నడుస్తూ ఉందా లేక దేవుని అధికారము నడుస్తూ ఉన్నదా? నీ బిడ్డలను నీ తరువాత సేవకులుగా ఉండే విధముగా తీర్చి దిద్దుతున్నావా లేక వారు బయట మంచి ఉద్యోగములు చేసి,సంపాదించి ముసలితనము నందు వారి వద్ద సంతోషముగా గడపాలి అని నీ సేవకొరకు వారిని తయారుచేస్తున్నావా?లోకమునందలి యజమానులవలె అన్ని బిడ్డలను తీసుకొనకుండా కేవలము తొలిచూలును మాత్రమే అడిగి మిగిలినవారిని మన ఇష్టమునకు ఇచ్చిన దేవుని కరుణకు కృతజ్ణతలు. మన పిల్లలను మన నుండి బలవంతముగా లాగుకొనకుండా, అధికారము చెలాయించకుండా మనము ఇస్తేనే తీసుకుంటున్న దేవుని సున్నిత మనస్సునకు కృతజ్ణతలు. నీవు నీ సంతానము విషయములో ఎలాంటి భారము కలిగి ఉన్నావు? నీ యజమానుని దానము వలన పుచ్చుకొనిన నీ కుమారులను, కుమార్తెలను ఎలా తీర్చిదిద్దుతున్నావు?
పశువులు అన్నీ కూడా వాటి జాతిని అనుసరించి ఒకే రకమైన పేరును కలిగి ఉంటాయి. ఆదాము వాటిలో ప్రతి ఒక్క దానికి గుర్తింపు కలిగే విధముగా పేరులు పెట్టలేదు కాని జాతి మొత్తానికి కలిపి ఒకే పేరు పెట్టటము జరిగినది. అవి మెడలో IDకార్డ్ వేసుకుని తిరగవు. వాటికి ఏ విధమైన పదోన్నతులు, బిరుదులు ఉండవు. అన్నీ ఒకే స్థాయిలో పనిని పంచుకుంటూ ఒకేచోట జీవితాంతము కలసి ఉంటాయి. యజమానులలో ఎవరో కొంతమంది మాత్రమే తమ పశువులకు ముద్దుగా పేర్లు పెట్టుకుని పిలుస్తారు. చాలామంది హే హే అనే విలువలేనట్లుగా పిలుస్తారు. అలా మనము పిలువబడకుండా దేవుడు మన అందరికీ పేరులు ఇవ్వటము గురించి ఆలోచించాలి. మనము అందరమూ దేవుని పిల్లలము, సేవకులము అనే పేరు ద్వారానే ఎరుగబడాలి తప్ప మన పేరునకు ముందు బిరుదులు, పేరు తరువాత డిగ్రీలు అవసరము లేదు. ఊరిలో పశువులను ఫలానా వారి పశువులా ఉండే అని గుర్తిస్తారు తప్ప వాటి పేరులతో వాటిని గుర్తించరు. అలానే మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువు శిష్యులుగా, సేవకులుగా మన గుర్తింపు ఉండాలి. మన గుర్తింపును మనము ఎప్పుడూ కోరుకొనకూడదు. మరి నీ గుర్తింపు నీ పేరు, బిరుదులు, డిగ్రీల ద్వారా ఉందా లేక నీ యజమాని పేరు మీద ఉందా?